Key Advisor Jamieson Greer to Trump : రష్యా చమురుపై భారత్ ఆధారపడడం లేదని ట్రంప్ సలహాదారు కీలక వ్యాఖ్యలు

ట్రంప్ సలహాదారు కీలక వ్యాఖ్యలు

Update: 2025-10-08 08:04 GMT

Key Advisor Jamieson Greer to Trump : రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం కాదని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు జెమీసన్ గ్రీర్ స్పష్టం చేశారు. అయితే, భారత్ ఇప్పటే తన చమురు కొనుగోళ్లను మాస్కో నుంచి వైవిధ్యీకరించడంలో ఉందని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్‌లో ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాలను గ్రీర్ వెల్లడించారు.

‘రష్యాతో భారత్‌కు గట్టి సంబంధాలు ఉన్నాయి. కానీ, గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయలేదు. డిస్కౌంట్ ధరల వల్ల గత రెండు-మూడేళ్లుగా రష్యా చమురును భారీగా దిగుమతి చేస్తోంది. ఇది కేవలం దేశీయ వినియోగం కోసమే కాదు, ఆ చమురును రిఫైన్ చేసి రీ-ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. దీని ఆధారంగా రష్యా చమురు కొనుగోళ్లు భారత ఆర్థికానికి ఏకైక ఆధారం కాదని స్పష్టమవుతోంది. కాబట్టి, వారు ఇతర దేశాల నుంచి కొనుగోళ్లు పెంచాలని మేము సూచిస్తున్నాం. వారు దీన్ని అర్థం చేసుకుని, ఇప్పటికే వైవిధ్యీకరణ చర్యలు ప్రారంభించారని మేం గమనిస్తున్నాం’ అని గ్రీర్ చెప్పారు.

భారత్ సార్వభౌమ దేశమని, తమ స్వంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉందని ట్రంప్ సలహాదారు గ్రీర్ అభిప్రాయపడ్డారు. ‘ఇతర దేశాలు ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరితో చేయకూడదు అనేది మేము ఆదేశించడం లేదు. ఈ అంశంలో ఎవరినీ బలవంతం చేయడం మాకు ఉద్దేశ్యం కాదు’ అని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా, రష్యా చమురు దిగుమతులు కారణంగా భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాల గురించి కూడా గ్రీర్ మాట్లాడారు. ‘అమెరికాతో వ్యాపారంలో భారత్‌కు 40 బిలియన్ డాలర్లకు పైగా మిగులు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. మేం వారికి అమ్మేవాటికంటే వారు మాకు అమ్మేవి ఎక్కువ. అయితే, రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్‌కు న్యూఢిల్లీ మద్దతు అందించినట్లు కనిపిస్తోంది. మాస్కోపై ఒత్తిడి పెంచడానికి భారత్‌పై ఈ సుంకాలు అవసరమయ్యాయి. అయినప్పటికీ, టారిఫ్‌ల విషయంలో అమెరికాతో భారత్ మంచి ఒప్పందం చేసుకుంటోంది’ అని గ్రీర్ తెలిపారు.

Tags:    

Similar News