Indian Woman Brutally Harassed by Chinese Officials at Shanghai Airport: షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో భారతీయ మహిళపై చైనా అధికారుల దారుణ వేధింపు.. పాస్‌పోర్ట్ ‘ఇన్వాలిడ్’ అంటూ 18 గంటల డిటెన్షన్
పాస్‌పోర్ట్ ‘ఇన్వాలిడ్’ అంటూ 18 గంటల డిటెన్షన్
Indian Woman Brutally Harassed by Chinese Officials at Shanghai Airport: చైనా పుడాంగ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో భారత మూలాల మహిళకు అవమానకరమైన వేధింపులు ఎదురయ్యాయి. తన పాస్‌పోర్ట్‌లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం పేరు చూసిన చైనా అధికారులు దాన్ని గుర్తించడానికి నిరాకరించారు. ఆ రాష్ట్రం చైనాదే అని పట్టుబట్టి, ఆమె పాస్‌పోర్ట్ చెల్లదని ప్రకటించారు. ఈ ఘటనపై జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
నవంబర్ 21న లండన్ నుంచి జపాన్‌కు వెళ్లేందుకు పెమా వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్ అనే మహిళ విమానం ఎక్కారు. ట్రాన్సిట్ కోసం షాంఘైలో దిగిన ఆమె పాస్‌పోర్ట్‌ను అధికారులు తనిఖీ చేశారు. దానిలో ఆమె పుట్టిన చోటు అరుణాచల్ ప్రదేశ్‌గా ఉండటం చూసి, ఇమిగ్రేషన్ అధికారులు దాన్ని చెల్లుబాటు చేయకుండా, చైనా ఈశాన్య భాగమని వాదించారు. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది సహా అధికారులు ఆమె వైపు చూసి నవ్వారని, చైనీస్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోమని హేళన చేశారని ఆమె ఆరోపించారు.
చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నప్పటికీ, పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని జపాన్ విమానం ఎక్కనివ్వలేదు. ట్రాన్సిట్ ఏరియాలోనే పరిమితం చేసి, టికెట్లు మళ్లీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఆహారం కొనేందుకు కూడా అనుమతించలేదని ఆమె తెలిపారు. యూకేలోని స్నేహితురాలి సహాయంతో షాంఘైలోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాత మాత్రమే సహాయం అందింది. భారత అధికారుల సహకారంతోనే ఆమె అక్కడి నుంచి బయటపడ్డారు.
ఈ ఘటన భారత సార్వభౌమత్వాన్ని, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలను అవమానించడమేనని పెమా లేఖ రాస్తూ ప్రధాని మోదీ, సీనియర్ అధికారులకు తెలిపారు. ప్రస్తుతం యూకేలో నివసిస్తున్న ఆమె, ఈ విషయంపై చైనా ప్రభుత్వం ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదని పేర్కొన్నారు.