India–Pakistan Exchange: భారత్-పాక్: అణు స్థావరాలు, ఖైదీల జాబితాల మార్పిడి.. ఈసారి ఎంతమంది?
ఖైదీల జాబితాల మార్పిడి.. ఈసారి ఎంతమంది?
India–Pakistan Exchange: భారత్, పాకిస్థాన్‌లు తమ అణు స్థావరాల జాబితాలను పరస్పరం పంచుకున్నాయి. ఒకరి అణు కేంద్రాలపై మరొకరు దాడులు చేయకూడదనే ద్వైపాక్షిక ఒప్పందం ఆధారంగా ఈ మార్పిడి జరిగింది. గతేడాది సైనిక ఉద్రిక్తతలు, ఘర్షణలు ఉన్నప్పటికీ ఈ సంప్రదాయం అలాగే కొనసాగింది. అలాగే, ఇరు దేశాల జైళ్లలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల వివరాలను కూడా దౌత్య మార్గాల ద్వారా పంచుకున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడించింది.
భారత విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం, ‘‘భారత్-పాకిస్థాన్‌లు దౌత్య మార్గాల ద్వారా ఏకకాలంలో అణు స్థావరాల జాబితాలను మార్పిడి చేసుకున్నాయి. ఇది వరుసగా 35వ సారి’’ అని తెలిపింది. 1988 డిసెంబర్ 31న ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. 1991 జనవరి 27 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం ప్రకారం 1992 జనవరి 1 నుంచి ప్రతి ఏటా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
ఖైదీల జాబితాల విషయానికొస్తే.. పాకిస్థాన్ జైళ్లలో భారతీయులుగా గుర్తించినవారు లేదా భారత్‌కు చెందినవారు 257 మంది ఉన్నారు. వీరిలో 58 మంది పౌర ఖైదీలు కాగా, మిగతా 199 మంది మత్స్యకారులు. మరోవైపు, భారత జైళ్లలో పాకిస్థాన్ జాతీయులుగా గుర్తించినవారు 424 మంది ఉన్నారు. అందులో 391 మంది పౌర ఖైదీలు, 33 మంది జాలరులు. 2008లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ వివరాలను పంచుకున్నాయి.
ఈ మార్పిడి ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని పెంచే ప్రక్రియగా చెప్పవచ్చు. ఉద్రిక్తతలు ఉన్నా ఈ సంప్రదాయం కొనసాగడం శుభసూచకమే.