Modi-Netanyahu Phone Conversation: మోదీ-నెతన్యాహు ఫోన్ సంభాషణ: కీలక భద్రతా సమావేశాన్ని ఆపి మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని!

కీలక భద్రతా సమావేశాన్ని ఆపి మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని!

Update: 2025-10-10 07:20 GMT

Modi-Netanyahu Phone Conversation: ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు గాజా శాంతి ఒప్పందం (Gaza ceasefire and hostage-release deal) కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఫోన్‌లో చర్చించారు. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. తన స్నేహితుడైన మోదీతో సంభాషించేందుకు నెతన్యాహు తన భద్రతా క్యాబినెట్ సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఈ వివరాలను ఒక ప్రకటన ద్వారా బయటపెట్టింది.

హమాస్‌తో ఒప్పందం గురించి చర్చించడానికి ఇజ్రాయెల్ భద్రతా క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. ఇందులో నెతన్యాహుతో పాటు పలువురు ముఖ్య అధికారులు సమావేశమయ్యారు. ఇంతలోనే మోదీ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో నెతన్యాహు సమావేశాన్ని తాత్కాలికంగా ఆపి మోదీతో మాట్లాడారు. బందీల విడుదల ఒప్పందంపై మోదీ నెతన్యాహును అభినందించారని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పేర్కొంది. శాంతి స్థాపనకు భారత్ నుంచి వచ్చిన నిరంతర మద్దతుకు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫోన్ కాల్ వివరాలను మోదీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫాంపై పంచుకున్నారు. ‘గాజా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సాధించిన పురోగతికి నా స్నేహితుడు నెతన్యాహును అభినందించాను.

బందీల విడుదలతో పాటు గాజా ప్రజలకు మానవతా సహాయాన్ని పెంచే ఈ ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రపంచంలో ఉగ్రవాదం ఏ రూపంలోనైనా సహించరానిదని నేను మరోసారి నొక్కి చెప్పాను’ అని మోదీ పోస్ట్ చేశారు. ఇంతకుముందు మోదీ ట్రంప్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడారు. చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళికను విజయవంతం చేసినందుకు ట్రంప్‌ను అభినందించారు. ఈ సమయంలో వాణిజ్య విషయాలపై కూడా వారు చర్చించుకున్నట్లు మోదీ వెల్లడించారు.

Tags:    

Similar News