Trump: ట్రంప్‌కు కత్తి ఇవ్వనందుకు మ్యూజియం డైరెక్టర్‌పై వేటు..!
మ్యూజియం డైరెక్టర్‌పై వేటు..!
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఇష్టానుసారం జరగకపోతే సహించలేకపోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ రాజు చార్లెస్‌కు బహుమతిగా ఇవ్వాలనుకున్న పురాతన ఖడ్గాన్ని మ్యూజియం నుంచి తీసుకురావాలని ట్రంప్ ఆదేశించారు. అయితే, మ్యూజియం డైరెక్టర్ అది అమెరికా చారిత్రక సంపద అని, ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ కార్యవర్గం ఆ డైరెక్టర్‌ను ఉద్యోగం నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంది.
గత నెలలో ట్రంప్ బ్రిటన్ పర్యటన సందర్భంగా రాజు చార్లెస్‌కు ప్రత్యేక బహుమతి ఇవ్వాలని భావించారు. డ్వైట్ డి. ఐసన్‌హోవర్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ అండ్ మ్యూజియంలో ఉన్న పురాతన ఖడ్గాల సేకరణలో ఒకదాన్ని ఎంచుకున్నారు. ఈ ఖడ్గం 1947లో ఐసన్‌హోవర్‌కు హాలండ్ రాణి విల్‌హెల్మినా నుంచి బహుమతిగా లభించింది. అప్పట్లో ఐసన్‌హోవర్ అమెరికా ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. ట్రంప్ ఆదేశాల మేరకు విదేశాంగ శాఖ అధికారులు మ్యూజియంను సంప్రదించారు. కానీ, మ్యూజియం డైరెక్టర్ టోడ్ ఆరింగ్టన్ దానిని అప్పగించడానికి నిరాకరించారు. ఇది అమెరికా ప్రజల ఆస్తి అని, బహుమతిగా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీంతో ట్రంప్ భార్య మెలానియా ఆ ఖడ్గం నమూనాను తయారు చేయించి రాజు చార్లెస్‌కు అందజేశారు.
పర్యటన ముగిసిన తర్వాత ట్రంప్ కార్యవర్గం ఆరింగ్టన్‌పై దృష్టి సారించింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు మోపారు. ఆరింగ్టన్ ఈ ఆరోపణలను ఖండించారు. తాను ఎప్పుడూ అలాంటి మాటలు చెప్పలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఉన్నతాధికారులు ఆయనకు ఫోన్ చేసి రాజీనామా చేయాలని లేదంటే తొలగిస్తామని హెచ్చరించారు. దీంతో ఆరింగ్టన్ తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. చరిత్ర మరియు తన ఉద్యోగం పట్ల తనకు ఎంతో ప్రేమ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఐసన్‌హోవర్ రెండో ప్రపంచ యుద్ధకాలంలో మిత్రరాష్ట్రాల సుప్రీం కమాండర్‌గా పనిచేశారు. 1953 నుంచి 1961 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఘటన ట్రంప్ పాలనా శైలిపై మరిన్ని విమర్శలకు దారి తీస్తోంది.