Protests intensify in Iran: ఇరాన్‌లో ఆందోళనలు తీవ్రం.. టెహ్రాన్‌లో 200కి పైగా మృతులు: వైద్యుడు వెల్లడి
టెహ్రాన్‌లో 200కి పైగా మృతులు: వైద్యుడు వెల్లడి
Protests intensify in Iran: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు (Iran Protests) రోజురోజుకూ తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరపడంతో టెహ్రాన్‌లోనే 200కి పైగా మంది మృతి చెందినట్లు ఓ వైద్యుడు వెల్లడించారు. ఈ సంగతిని అంతర్జాతీయ మాధ్యమం టైమ్‌కు అజ్ఞాతంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
టెహ్రాన్‌లోని ఆరు ఆసుపత్రుల్లో రికార్డు చేయబడిన మరణాల సంఖ్య 217 అని, వీటిలో చాలా వరకు లైవ్ అమ్యూనిషన్ (ప్రత్యక్ష కాల్పులు) వల్లే సంభవించాయని వైద్యుడు చెప్పారు. ఎక్కువ మృతులు యువకులేనని, ఉత్తర టెహ్రాన్‌లోని ఒక పోలీస్ స్టేషన్ వద్ద భద్రతా దళాలు మెషిన్ గన్‌లతో కాల్పులు జరపడంతో 30 మంది ఆందోళనకారులు స్థానికంగానే ప్రాణాలు కోల్పోయారని వివరించారు. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని ఆయన అంచనా వేశారు.
ఇరాన్‌లో ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్లను పూర్తిగా నిలిపివేయడంతో నిరసనలు, మరణాల వివరాలు ప్రపంచానికి సరిగా తెలియకుండా పోతున్నాయని వైద్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం, ఇప్పటివరకు సుమారు 65 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ట్రంప్ చేతులు ఇరాన్ ప్రజల రక్తంతో తడిసిపోయాయి" అని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడిని సంతోషపరచడానికి సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారని ప్రజలపై విమర్శలు గుప్పించారు.
మరోవైపు, ప్రవాసంలో ఉన్న ఇరాన్ యువరాజు రెజా పహ్లావి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను సంప్రదించి, నిరసనకారులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేస్తున్న దాడుల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, అమెరికా జోక్యం చేసుకోవాలని కోరారు.
అధికారులు నిరసనలను అణచివేయడానికి తీవ్ర చర్యలు చేపట్టిన నేపథ్యంలో, టెహ్రాన్‌లోని గ్రాండ్ బజార్ వంటి ప్రాంతాల్లో కూడా భద్రతా దళాలు టియర్ గ్యాస్, అరెస్టులతో ప్రజలను చెదరగొట్టాయి. ఈ ఆందోళనలు దేశ ఆర్థిక సంక్షోభం, కరెన్సీ విలువ పడిపోవడం నేపథ్యంలో మొదలై, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో విస్తరిస్తున్నాయి.