Russia Warns: వెనెజువెలా తీరంలో నౌకల స్వాధీనం: అమెరికా పడవలు ముంచేస్తాం.. రష్యా హెచ్చరిక

అమెరికా పడవలు ముంచేస్తాం.. రష్యా హెచ్చరిక

Update: 2026-01-08 11:06 GMT

Russia Warns: వెనెజువెలాకు చెందిన చమురు రవాణా నౌకలను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడంతో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రష్యా జెండా ఎగురవేస్తూ ప్రయాణిస్తున్న ఓ నౌకతోపాటు మరో జెండారహిత నౌకను అమెరికా సీజ్ చేయడంపై మాస్కో తీవ్రంగా స్పందించింది. రష్యా చట్టసభ సభ్యుడు అలెక్సీ జురావ్లెవ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా అతిగా ప్రవర్తిస్తోందని, అంతర్జాతీయ చట్టాలను ధిక్కరిస్తోందని ఆయన ఆరోపించారు. ‘‘అవసరమైతే ప్రతీకార చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. టార్పిడోలతో దాడి చేయడం, అమెరికా కోస్ట్ గార్డ్ నౌకలను ముంచేయడం వంటి చర్యలకు దిగవలసి వస్తుంది. అమెరికా ఇలాంటి చర్యలకు సిద్ధంగా ఉండాలి’’ అని జురావ్లెవ్ హెచ్చరించారు.

ఐస్‌లాండ్ దక్షిణ తీరానికి సుమారు 190 మైళ్ల దూరంలో ఈ ఆపరేషన్ జరిగింది. రష్యా జెండాతో ఉన్న ‘మ్యారినెరా’ (పూర్వం బెల్లా-1) నౌకను అమెరికా రక్షణ శాఖ, తీరరక్షక దళాలు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నాయి. హెలికాప్టర్ నుంచి మెరీన్ సిబ్బంది నౌకపైకి దిగి, అందులోని సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యకు బ్రిటన్ కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో ఏ జెండా లేని ‘సోఫియా’ అనే మరో నౌకను కూడా అమెరికా దళాలు సీజ్ చేశాయి. ఈ నౌకలు వెనెజువెలా చమురును రవాణా చేస్తున్నట్లు, అమెరికా ఆంక్షలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను యూఎస్ కోస్ట్ గార్డ్ విడుదల చేసింది. అమెరికా భద్రత, అంతర్జాతీయ చట్టాలను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.

ఈ ఘటన సమయంలో రష్యా నౌకాదళం సమీపంలోనే ఉన్నట్లు సమాచారం. దీంతో రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది. రష్యా ఈ చర్యను అంతర్జాతీయ సముద్ర చట్టాల ఉల్లంఘనగా ఖండిస్తోంది.

Tags:    

Similar News