Trump: అక్రమ వలసదారులపై సున్నితంగా వ్యవహరించే సమయం ముగిసింది: ట్రంప్
సున్నితంగా వ్యవహరించే సమయం ముగిసింది: ట్రంప్
Trump: అక్రమ వలసలను ఇకపై ఏమాత్రం సహించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. డాలస్‌లో భారతీయ వ్యక్తి చంద్ర నాగమల్లయ్య హత్యకు గురైన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ హత్యకు క్యూబా వలసదారుడైన యోర్డానిస్ కోబోస్ మార్టినెజ్ కారణమని, అతడిపై ఫస్ట్ డిగ్రీ హత్యా నేరం కింద అభియోగాలు నమోదు చేసి విచారణ జరిపిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. అమెరికాను మళ్లీ సురక్షిత దేశంగా మార్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఈ విషయంపై పోస్ట్ చేస్తూ, "చంద్ర నాగమల్లయ్య హత్య కేసు నా దృష్టికి వచ్చింది. డాలస్‌లో ఆయనకు మంచి పేరు ఉంది. అలాంటి వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. తన భార్య, కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు ఈ నేరానికి పాల్పడ్డాడు" అని విచారం వ్యక్తం చేశారు.
గతంలో బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానాలే మార్టినెజ్ వంటి వ్యక్తులు అమెరికాలో నివసించేందుకు అవకాశం కల్పించాయని ట్రంప్ విమర్శించారు. "ఈ వ్యక్తికి నేర చరిత్ర ఉన్నప్పటికీ అతడిని అమెరికాలో ఉండేందుకు అనుమతించారు. చిన్నారిపై లైంగిక దాడి, దొంగతనం వంటి నేరాలకు అతడు గతంలో అరెస్టయ్యాడు. క్యూబా తన దేశంలో ఇలాంటి నేరస్తులను ఉంచుకోవాలనుకోలేదు కాబట్టి వారిని మా దేశానికి పంపింది. ఇకపై అక్రమ వలసదారులపై సున్నితంగా వ్యవహరించే ప్రసక్తే లేదు" అని ట్రంప్ ఉద్ఘాటించారు.
సెప్టెంబర్ 10న డాలస్‌లోని ఓ మోటెల్‌లో చంద్ర నాగమల్లయ్య హత్యకు గురయ్యారు. నిందితుడు మార్టినెజ్, నాగమల్లయ్య తలను నరికి చెత్తబుట్టలో వేసిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేశారు.