Trump Praises Modi: ఈజిప్ట్ సదస్సులో మోదీని ప్రశంసించిన ట్రంప్: భారత్-పాక్ శాంతి గురించి వ్యాఖ్యలు
భారత్-పాక్ శాంతి గురించి వ్యాఖ్యలు
Trump Praises Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈజిప్టులో జరిగిన ఒక సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. భారత్, పాకిస్థాన్ దేశాలు కలిసి సామరస్యంగా జీవిస్తాయని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పాలస్తీనా, హమాస్ మధ్య తొలి దశ శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో వివిధ దేశాధినేతలు ఈజిప్టులో సమావేశమయ్యారు.
ఈ శాంతి ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన ట్రంప్, ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశాన్ని గొప్ప దేశంగా అభివర్ణించారు. భారత్‌లో తనకు అత్యున్నత స్థాయిలో గొప్ప స్నేహితుడు ఉన్నారని, ఆయన తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఆయన మోదీ పేరును నేరుగా ప్రస్తావించలేదు.
ట్రంప్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను చూస్తూ, భారత్-పాక్ దేశాలు సామరస్యంగా జీవిస్తాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా షరీఫ్ నవ్వుతూ కనిపించారు. అంతకుముందు ట్రంప్, పాకిస్థాన్ ప్రధానితో పాటు ఆ దేశ ఆర్మీ చీఫ్‌లను కూడా ప్రశంసించారు.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, ట్రంప్ అవిశ్రాంత కృషి వల్ల మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొందని, దక్షిణాసియాతో పాటు మధ్యప్రాచ్యంలో లక్షలాది ప్రాణాలను ఆయన కాపాడారని పేర్కొన్నారు. ట్రంప్‌ను మళ్లీ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని భావిస్తున్నట్లు షరీఫ్ వెల్లడించారు.
ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయినప్పటికీ, ట్రంప్ తాను పలు యుద్ధాలను ఆపినట్లు వివిధ వేదికల ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన నోబెల్ శాంతి బహుమతి తనకు వస్తుందని ఆశించారు. కానీ, ఈ ఏడాది ఆ బహుమతి వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మడోచ్‌కు లభించింది. దీంతో ట్రంప్ ఆశలు భగ్నమయ్యాయి. ఈ బహుమతి ట్రంప్‌కు రాకపోవడంపై వైట్ హౌస్ కూడా ఘాటుగా స్పందించింది.