Trump Warns: ట్రంప్‌ హెచ్చరిక: గ్రీన్‌లాండ్‌పై మా నియంత్రణ తప్పదు.. ఏమైనా చేస్తాం!

ఏమైనా చేస్తాం!

Update: 2026-01-10 05:49 GMT

Trump Warns: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని తమ సంకల్పమని స్పష్టం చేశారు. స్థానికులు అంగీకరించినా, ఒప్పుకోకపోయినా ఈ దిశగా అడుగులు వేస్తామని వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. లేకపోతే రష్యా లేదా చైనా ఆ ప్రాంతాన్ని కబ్జా చేసుకునే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు. ఆ రెండు దేశాలను తమ సరిహద్దుల్లో చూడాలని మేం కోరుకోవడం లేదని తేల్చిచెప్పారు.

మొదట చర్చల ద్వారా గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలని భావించామని, అయితే అది సాధ్యపడకపోవడంతో కఠిన చర్యలకు సిద్ధమవుతున్నామని ట్రంప్‌ వెల్లడించారు. గ్రీన్‌లాండ్‌ చుట్టుపక్కల సముద్రాల్లో ఇప్పటికే చైనా, రష్యా తమ నావికా దళాలను మోహరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆలస్యం చేస్తే ఆ రెండు దేశాలు ముందుకు వచ్చి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాయని హెచ్చరించారు. అందుకే అవసరమైతే బలవంతపు మార్గాలను కూడా అనుసరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

గ్రీన్‌లాండ్‌ అమెరికాకు వ్యూహాత్మకంగా, రక్షణపరంగా చాలా ముఖ్యమైనదని ట్రంప్‌ పునరుద్ఘాటించారు. ఆర్కిటిక్‌ ప్రాంతంలో ప్రత్యర్థి దేశాలను ఎదుర్కోవడానికి దానిపై పూర్తి నియంత్రణ అవసరమని వివరించారు. ఈ విషయంపై మరిన్ని చర్చలు జరపడానికి వచ్చే వారంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గ్రీన్‌లాండ్‌, డెన్మార్క్‌ నేతలతో సమావేశమవుతారని ఆయన తెలిపారు.

వెనెజువెలా చమురు నిల్వలు: ఇరు దేశాలకూ లాభం

ఇదిలా ఉండగా, వెనెజువెలా నుంచి చమురు సేకరణ వల్ల ఆ దేశ ప్రజలతో పాటు అమెరికా పౌరులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. అక్కడి పెట్రోలియం నిల్వలను వెలికితీసేందుకు అమెరికా చమురు కంపెనీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ చర్యలతో ఇంధన ఉత్పత్తి పెరిగి, చమురు ధరలు తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వెనెజువెలాకు చెందిన చమురు సంస్థల ప్రతినిధులతోనూ ట్రంప్‌ సమావేశమై మాట్లాడారు.

Tags:    

Similar News