Trump’s Warning: ట్రంప్ హెచ్చరిక: గ్రీన్‌లాండ్‌ను అమెరికా సొంతం చేసుకుంటుంది.. రష్యా ముప్పు తప్పదు!
రష్యా ముప్పు తప్పదు!
Trump’s Warning: ప్రపంచంలోనే అతిపెద్ద దీవి అయిన గ్రీన్‌లాండ్ (Greenland) వనరులు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తీవ్ర ఒత్తిడి తెచ్చారు. రష్యా, చైనాల నుంచి వచ్చే ముప్పును అడ్డుకోవడానికి గ్రీన్‌లాండ్‌ను అమెరికా నియంత్రణలోకి తీసుకోవాలని ఆయన పట్టుబట్టారు. ఈ విషయంలో డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రజలు, ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ట్రంప్ మరింత కఠిన స్థాయికి చేరారు.
గ్రీన్‌లాండ్ భద్రతకు రష్యా నుంచి పెద్ద ముప్పు పొంచి ఉందని నాటో గత 20 ఏళ్లుగా హెచ్చరిస్తున్నప్పటికీ, డెన్మార్క్ ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదని ట్రంప్ ఆరోపించారు. రష్యాను ఎదుర్కోవడంలో డెన్మార్క్ విఫలమైందని, అందుకే ఇప్పుడు భద్రతా కారణాలతో అమెరికా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. "సమయం ఆసన్నమైంది.. ఇది జరిగి తీరుతుంది" అంటూ ఆయన కీలక పోస్టు చేశారు. ఏ విధంగైనా గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకుంటామని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌కు లేఖ రాశారు. తాను 8 యుద్ధాలను ఆపినప్పటికీ శాంతి బహుమతి రాలేదని, ఇకపై కేవలం శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇకపై అమెరికాకు ఏది ప్రయోజనకరమో దాని గురించే ఆలోచిస్తానని తెలిపారు. నాటోకు పంపిన మరో లేఖలో గ్రీన్‌లాండ్‌ను చైనా, రష్యాల నుంచి డెన్మార్క్ రక్షించలేకపోతే ఆ దేశానికి యాజమాన్య హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అమెరికా నాటో కోసం చాలా చేసిందని, ఇప్పుడు నాటో తమకు సహాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రీన్‌లాండ్‌పై పూర్తి నియంత్రణ లేకపోతే ప్రపంచం సురక్షితంగా ఉండదని హెచ్చరించారు.
గ్రీన్‌లాండ్ విషయంలో తమకు మద్దతు ఇవ్వని దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. దీనిపై బ్రిటన్‌తోపాటు ఐరోపా యూనియన్ దేశాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మాట్లాడుతూ ట్రంప్ బెదిరింపులకు లొంగేది లేదని, గ్రీన్‌లాండ్ ఎప్పటికీ డెన్మార్క్‌లో భాగమే అని స్పష్టం చేశారు. ఐరోపా యూనియన్ తన అత్యంత శక్తివంతమైన వాణిజ్య ఆయుధం ‘ట్రేడ్ బజూకా’ను మొదటిసారి ఉపయోగించాలని యోచిస్తోందని తెలిసింది.
ఈ ఘటనలు అమెరికా-ఐరోపా సంబంధాల్లో కొత్త సంక్షోభాన్ని సృష్టించాయి. గ్రీన్‌లాండ్ ప్రజలు, డెన్మార్క్ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి తలొగ్గబోమని స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదం మరిన్ని అంతర్జాతీయ పరిణామాలకు దారితీయనుంది.