US Accuses China of Attacking Global Economy: చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాడి.. భారత్, ఐరోపా సాయం కోరుతున్న అమెరికా మంత్రి
భారత్, ఐరోపా సాయం కోరుతున్న అమెరికా మంత్రి
US Accuses China of Attacking Global Economy: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై సుంకాలు విధించిన అమెరికా, చైనా విషయంలో మాత్రం మన సహాయాన్ని అర్థిస్తోంది. అరుదైన ఖనిజాలపై చైనా విధించిన నియంత్రణలను ఎదుర్కోవడానికి భారత్ (India) మరియు ఐరోపా దేశాల మద్దతు అవసరమని అమెరికా (USA) ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు.
చైనా (China) ఇటీవల అరుదైన ఖనిజాల (Rare Earth Metals) ఎగుమతులపై కఠిన నిబంధనలు విధించింది. విదేశీ సంస్థలు ఈ ఖనిజాలను దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతి తప్పనిసరి అని తెలిపింది. ఈ నిర్ణయంపై స్కాట్ బెసెంట్ స్పందిస్తూ, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా పరిణమిస్తుందని విమర్శించారు. "ఇది చైనా మరియు ప్రపంచ దేశాల మధ్య ఉన్న పోటీ. చైనా ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై దాడి చేస్తోంది. మేము దాన్ని అనుమతించము. చైనా దూకుడును అడ్డుకోవడానికి మిత్ర దేశాలతో చర్చలు జరుపుతున్నాం. దీనికి భారత్ మరియు ఐరోపా దేశాల సహకారం కావాలి" అని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. అమెరికా ప్రపంచ శాంతిని కాంక్షిస్తుంటే, చైనా మాత్రం ఆర్థిక యుద్ధాన్ని ప్రారంభిస్తోందని ఆయన ఆరోపించారు.
అరుదైన ఖనిజాలపై చైనా నియంత్రణలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ను కోప్పరిచాయి. దీంతో చైనాపై 100 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇవి నవంబర్ 1 నుంచి లేదా అంతకు ముందు నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అంతేకాకుండా, అమెరికా సంస్థలు చైనాకు ఎగుమతి చేసే కీలక సాఫ్ట్‌వేర్‌లపై కూడా నియంత్రణలు విధిస్తామని వెల్లడించారు.
వంటనూనె వ్యాపారం నిలిపివేత దిశగా..
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే ఇరు దేశాలు నౌకలపై పరస్పర సుంకాలు విధించుకున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. చైనాతో వంటనూనె సంబంధిత వ్యాపారాలను రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అమెరికా రైతుల నుంచి సోయాబీన్లను చైనా ఉద్దేశపూర్వకంగా కొనుగోలు చేయకుండా ఉందని ఆరోపించారు. ఇది ఆర్థిక ఉద్రిక్తతలను పెంచుతుందని విమర్శించారు. దీనికి ప్రతిచర్యగా చైనాతో వంటనూనె వ్యాపారాన్ని నిలిపివేయాలనుకుంటున్నామని, ఆ దేశ వంటనూనె తమకు అవసరం లేదని పేర్కొన్నారు.
బ్రిక్స్ కూటమి.. డాలర్‌పై దాడికే:
ఈ సందర్భంగా బ్రిక్స్ కూటమిపై ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. డాలర్‌ను బలహీనపరిచేందుకే ఈ కూటమి ఏర్పడిందని ఆరోపించారు. బ్రిక్స్‌లో చేరాలనుకునే దేశాలపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం బ్రిక్స్ కూటమి విచ్ఛిన్నమవుతోందని విమర్శించారు.