US-China: అమెరికా-చైనా: చైనీస్ మహిళతో రహస్య ప్రేమ.. యూఎస్ డిప్లమాట్‌పై వేటు

యూఎస్ డిప్లమాట్‌పై వేటు

Update: 2025-10-09 09:38 GMT

US-China: చైనా మహిళతో రహస్యంగా నడిపిన ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టినందుకు ఒక అమెరికా దౌత్యవేత్తను తొలగించారు. ఆ మహిళపై గూఢచర్యం ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ ఒక ప్రకటనలో తెలిపారు.

చైనీయులతో ఇలాంటి సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడంపై అమెరికా ప్రభుత్వం గతంలోనే కఠిన నిషేధాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ దౌత్యవేత్తను ఉద్యోగం నుంచి తొలగించినట్లు సమాచారం. పిగోట్ ప్రకటన ప్రకారం.. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా మహిళతో ఆయన ప్రేమాయణం సాగించి, దాన్ని రహస్యంగా ఉంచారని నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. అందుకే ఆయనపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా రూబియో నాయకత్వంలో తమ దేశ జాతీయ భద్రతకు హాని కలిగించే ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. అయితే, ఆ దౌత్యవేత్త పేరును అధికారులు బహిర్గతం చేయకపోవడం గమనార్హం.

అమెరికా, చైనా దేశాలు ఒకరి రహస్యాలు మరొకరికి చేరకుండా ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో చైనాలో పని చేస్తున్న తమ సిబ్బందికి అమెరికా ప్రభుత్వం గతంలోనే తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ క్లియరెన్స్ ఉన్న కాంట్రాక్టర్లు చైనీయులతో శారీరక సంబంధాలు పెట్టుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గతంలో మాస్కోలో ఒక నావికాదళ ఉద్యోగి సోవియట్ గూఢచారి ప్రలోభాలకు లోనయ్యారు. దీంతో 1987లో అమెరికా ప్రభుత్వం చైనా, సోవియట్ యూనియన్‌లోని సిబ్బంది స్థానికులతో స్నేహాలు, డేటింగ్ లేదా లైంగిక సంబంధాలు పెట్టుకోకుండా నిషేధం విధించింది.

Tags:    

Similar News