US Government Shutdown: అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్: ఆరేళ్లలో మొదటిసారి

ఆరేళ్లలో మొదటిసారి

Update: 2025-10-01 08:35 GMT

US Government Shutdown: అమెరికా ప్రభుత్వం ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది. కీలక నిధుల బిల్లులకు కాంగ్రెస్‌లో ఆమోదం లభించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అమెరికా సమయం ప్రకారం బుధవారం అర్ధరాత్రి తర్వాత (భారత్ సమయం ప్రకారం ఉదయం 9:30కి) షట్‌డౌన్ ప్రారంభమైంది.

రిపబ్లికన్ పార్టీ ప్రతిపాదించిన తాత్కాలిక నిధుల బిల్లును డెమోక్రాట్లు తమ డిమాండ్లు నెరవేర్చకపోవడంతో వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వంలో అత్యవసరేతర సేవలు స్తంభించాయి. దేశవ్యాప్తంగా లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభావితమవుతారు. సుమారు 7,50,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనున్నారు. అయితే, సైన్యం, విమాన ట్రాఫిక్ నియంత్రణ వంటి అత్యవసర విభాగాల్లో పనిచేసే లక్షల మంది సిబ్బంది పని కొనసాగించాల్సి ఉంటుంది. వీరికి షట్‌డౌన్ సమయంలో వేతనాలు చెల్లించకపోయినా, తర్వాత చెల్లింపులు జరుగుతాయి. కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం హామీ లేదు.

ఏయే విభాగాలపై ప్రభావం?

సామాజిక భద్రత (సోషల్ సెక్యూరిటీ), వైద్య భీమా (మెడికేర్) లబ్ధిదారులపై ఈ షట్‌డౌన్ ప్రభావం ఉండదు. ఇవి ప్రత్యేక చట్టాల ద్వారా కాంగ్రెస్ ఆమోదిస్తుంది. వీటికి వార్షిక నిధులు ముందుగానే కేటాయించబడతాయి. అయితే, జాతీయ ఉద్యానవనాలు, మ్యూజియాలు, పరిశోధనా సంస్థలు వంటివి మూతపడతాయి. పాస్‌పోర్ట్, వీసా సేవలు ఆలస్యమవుతాయి. ఆహార భద్రత తనిఖీలు, పర్యావరణ నిబంధనల అమలు కూడా ప్రభావితమవుతాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యుల మధ్య ఎలాంటి రాజీ సూచనలు కనిపించడం లేదు. షట్‌డౌన్ ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. గతంలో 2018-19లో 35 రోజుల పాటు షట్‌డౌన్ జరిగింది, అది అమెరికా చరిత్రలోనే అతి సుదీర్ఘమైనది. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో అది సంభవించింది.

Tags:    

Similar News