US President Donald Trump: ట్రంప్: మేం అడిగేది ఒక్క ఐసు ముక్కే.. బలప్రయోగం చేయం

బలప్రయోగం చేయం

Update: 2026-01-22 05:43 GMT

US President Donald Trump: అమెరికా జాతీయ భద్రత కోసం గ్రీన్‌లాండ్‌ను యాజమాన్య హక్కుతో సహా సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నామని, అయితే దాని కోసం బలప్రయోగం చేయబోమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. డెన్మార్క్ నుంచి గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి నాటో అనుమతించాలని, విస్తరణవాదాన్ని అడ్డుకోకూడదని ఆయన డిమాండ్ చేశారు.

రెండోసారి అధికారం చేపట్టిన ఏడాది పూర్తయిన సందర్భంగా శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, తర్వాత దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదికపై 70 నిమిషాల పాటు ప్రసంగించారు. రెండు చోట్లా గ్రీన్‌లాండ్ అంశం ప్రస్తావనకు వచ్చింది.

"ప్రపంచాన్ని రక్షించేందుకు మేం 'ఒక ఐసు ముక్క'ను అడుగుతున్నాం. నాటో వాళ్లు దాన్ని వదిలిపెట్టరట. వాళ్లు సరే అంటే మేం ఎంతో సంతోషిస్తాం. ఒకవేళ నో చెబితే మేం గుర్తుపెట్టుకుంటాం. బలప్రయోగం చేయకుండా మాకు ఏమీ దొరకకపోవచ్చు. అలా చేస్తే ఎవరూ మమ్మల్ని ఆపలేరు. కానీ నేను అలా చేయను. సరేనా?" అని ట్రంప్ అన్నారు.

గ్రీన్‌లాండ్‌ను భూమిగా కాకుండా భారీ మంచు ముక్కగా వర్ణించిన ఆయన, అది అమెరికా, చైనా, రష్యా మధ్య ఉండటం వల్ల వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని తెలిపారు. "అరుదైన ఖనిజాల కోసం కాదు. దశాబ్దాలుగా మేం ఇచ్చిన దానితో పోలిస్తే ఇప్పుడు అడుగుతున్నది చాలా చిన్నది" అని వివరించారు.

డెన్మార్క్‌తో వెంటనే సంప్రదింపులు మొదలుపెట్టాలని ఆయన సూచించారు. రెండో ప్రపంచ యుద్ధంలో డెన్మార్క్‌ను అమెరికా కాపాడినా, ఆ దేశంలో తమపట్ల కృతజ్ఞత లేదని విమర్శించారు. గ్రీన్‌లాండ్ నిజానికి ఉత్తర అమెరికా భూభాగమేనని, ఆర్కిటిక్ ప్రాంతంలో తవ్వకాలు కష్టమని, వందలాది అడుగుల మంచును తవ్వాల్సి ఉంటుందని చెప్పారు.

దావోస్ ప్రసంగంలో "చాలామంది మిత్రులకు, కొందరు శత్రువులకు అభివాదం" అంటూ ప్రారంభించిన ట్రంప్, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు సమీపంలో ఉందని, తాను లేకుండా బైడెన్ లేదా హారిస్ అధికారంలో ఉంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదని వాదించారు. చైనా గాలి మరలు (విండ్ టర్బైన్స్) ఐరోపాలో అమ్ముతోందని విమర్శించారు.

తాను ప్రతి దేశంతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని, ఏ దేశాన్నీ నాశనం చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రసంగానికి ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. మరోవైపు వ్యతిరేక ప్రదర్శనలు కూడా జరిగాయి.

శ్వేతసౌధంలో మాట్లాడుతూ, తన చర్యలతో దేవుడు గర్విస్తున్నాడని, క్రైస్తవులు, యూదులతోపాటు అనేకమంది ప్రాణాలను కాపాడుతున్నామని చెప్పారు. భారత్-పాకిస్థాన్ అణు యుద్ధాన్ని ఆపి మిలియన్ల ప్రాణాలు రక్షించానని, ఎనిమిది యుద్ధాలను పది నెలల్లో ముగించానని పునరుద్ఘాటించారు. నోబెల్ బహుమతి ఎంపికలో నార్వే పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

నాటోకు తాను చేసినంత ఎవరూ చేయలేదని కూడా ట్రంప్ పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్ విషయంలో నాటో సహకరిస్తే అందరికీ మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News