Zelensky: ఆయుధాలే బతుకు మరణాలను నిర్ణయిస్తున్నాయి: జెలెన్‌స్కీ
మరణాలను నిర్ణయిస్తున్నాయి: జెలెన్‌స్కీ
Zelensky: ప్రపంచంలో మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ జరుగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ హెచ్చరించారు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మాట్లాడుతూ, రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు. "ఎవరు బతకాలో, ఎవరు చనిపోవాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి. స్నేహితులు లేని ఈ ప్రపంచంలో ఆయుధాలు మాత్రమే మిగులుతాయి. భద్రతా హామీలు లేవు. రష్యా మా మీద యుద్ధాన్ని కొనసాగిస్తోంది. దానిని అంతర్జాతీయ సమాజం ఖండించాలి. పుతిన్‌ను ఇప్పుడు ఆపకపోతే, ఈ యుద్ధం మరింత విస్తరిస్తుంది. రష్యా డ్రోన్లు యూరప్ అంతటా సంచరిస్తున్నాయి," అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై సైనిక చర్యలు ప్రారంభించినప్పటి నుంచి ఈ యుద్ధం మూడేళ్లకు పైగా కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని నిలిపివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక అంతర్జాతీయ నాయకుల ప్రయత్నాలు కూడా ఈ సంఘర్షణను ఆపలేకపోయాయి. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలు ఉక్రెయిన్, గాజా, సుడాన్‌లలో యుద్ధాలను నియంత్రించలేకపోయాయని జెలెన్‌స్కీ విమర్శించారు.
ఇదిలాఉంటే, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఐరాస సభలో మాట్లాడుతూ, ప్రపంచంలో పెరుగుతున్న అనిశ్చితులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. "మహమ్మారి నుంచి తేరుకోకముందే ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, వాతావరణ సంక్షోభాలు, అస్థిర వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహంలో అనిశ్చితి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో క్షీణత వంటి సవాళ్లను గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్నాయి," అని ఆయన వ్యాఖ్యానించారు.