Zelensky : ట్రంప్‌ ఆరోపణలపై జెలెన్‌స్కీ స్పందన: భారత్‌ మావైపే ఉందని కీలక వ్యాఖ్యలు

భారత్‌ మావైపే ఉందని కీలక వ్యాఖ్యలు

Update: 2025-09-24 09:39 GMT

Zelensky : రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి భారత్‌ నిధులు సమకూరుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు గుప్పిస్తున్న వేళ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ వ్యాఖ్యలకు స్పందిస్తూ, భారత్‌ తమకు మద్దతుగా ఉందని జెలెన్‌స్కీ అన్నారు. రష్యాతో భారత్‌ ఇంధన ఒప్పందం తమకు సవాలుగా ఉన్నప్పటికీ, ఈ సమస్యను ట్రంప్‌ పరిష్కరించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం తన ఇంధన దిగుమతి విధానాన్ని మార్చుకుంటుందని జెలెన్‌స్కీ భావిస్తున్నట్లు తెలిపారు.

అయితే, చైనా విషయంలో భారత్‌లా మద్దతు ఉందని చెప్పలేమని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. రష్యాతో యుద్ధం ముగిస్తే చైనాకు ఎలాంటి ప్రయోజనం ఉండదని వారు భావిస్తున్నారని, అయినప్పటికీ ట్రంప్‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వైఖరిని మార్చగలరని ఆయన అన్నారు. ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్‌, చైనాలు నిధులు సమకూరుస్తున్నాయని ఆరోపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఈ దేశాలు యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. నాటో దేశాలు కూడా రష్యా నుంచి ఇంధన ఉత్పత్తుల కొనుగోలును తగ్గించలేదని, అందుకే యుద్ధాన్ని ఆపేందుకు మరింత కఠినమైన సుంకాలను విధించనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా ఆగస్టు 27 నుంచి అదనపు సుంకాలను విధించింది. ఈ నిర్ణయాన్ని జెలెన్‌స్కీ సమర్థించారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించడం సరైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News