BPSC Exam Irregularities Allegations: బీపీఎస్సీ పరీక్షలో అవకతవకల ఆరోపణలు.. బారికేడ్లు దూకి సీఎం నివాసం ముట్టడికి విద్యార్థుల యత్నం
విద్యార్థుల యత్నం
BPSC Exam Irregularities Allegations: బిహార్‌లో బీపీఎస్సీ 70వ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థుల నిరసనలు ఉద్రిక్త రూపం దాల్చాయి. పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులు గాంధీ మైదానం నుంచి ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ నివాసం వైపు ర్యాలీ చేశారు.
బారికేడ్లను దూకి ముందుకు సాగిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. జల ఫిరంగులను ప్రయోగించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
పోటీ పరీక్షలు, నియామకాలకు సంబంధించిన వివిధ డిమాండ్లపై పట్నాలో విద్యార్థులు, ఉద్యోగార్థులు కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ ర్యాలీ కూడా అందులో భాగమే. సోమవారం అధికారులు విద్యార్థి ప్రతినిధులతో చర్చలు జరిపినప్పటికీ, ముఖ్యమంత్రి లేదా విద్యాశాఖ మంత్రితో మాట్లాడాలని విద్యార్థులు పట్టుబట్టుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ‘విద్యార్థి సహయోగ శిబిరం’ పేరుతో నెలవారీ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి నెలా నాలుగో మంగళవారం విద్యాసంస్థల్లో ఈ శిబిరాలు నిర్వహించి, విద్యార్థులు తమ సమస్యలను అధికారులకు నేరుగా తెలియజేసే అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 1100 హెల్ప్‌లైన్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.