Cauvery Water Dispute: కావేరీ జల వివాదం: సుప్రీంకోర్టు తమిళనాడుకు కీలక సూచన
కీలక సూచన
Cauvery Water Dispute: కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కావేరీ జల వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక సూచనలు చేసింది. కర్ణాటక నుంచి తమకు రావాల్సిన కావేరీ నీటి వాటా సక్రమంగా అందడం లేదని తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. కర్ణాటక నుంచి తమకు దామాషా ప్రకారం రావాల్సిన నీరు విడుదల కావడం లేదని తమిళనాడు తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. నీటి పంపిణీ, విడుదలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కావేరీ జల నిర్వహణ ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఎమ్‌ఏ)ను ముందుగా ఆశ్రయించాలని తమిళనాడుకు సూచించింది. సాంకేతిక లెక్కింపులు, నీటి నిల్వల ఆధారంగా సీడబ్ల్యూఎమ్‌ఏ తుది నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
వర్షాభావం కారణంగా నీటి నిల్వలు తగ్గాయని కర్ణాటక చెబుతోంది. అయినా తమకు రావాల్సిన న్యాయమైన వాటా నీటిని విడుదల చేయాలని తమిళనాడు పట్టుపడుతోంది. ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించినా, సీడబ్ల్యూఎమ్‌ఏ ద్వారానే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.