బీహార్‌ రాజకీయాల్లో యాక్టీవ్‌ అవ్వనున్న చిరాగ్‌ పాశ్వాన్‌

Update: 2025-06-05 12:39 GMT

వచ్చే ఏడాది బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీహార్‌ అధికార కూటమిలో సైతం చీలికలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో మంత్రిగా ఉన్న లోక్‌ జన శక్తి పార్టీ (రాంవిలాస్‌) అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆయన ఇకపై జాతీయ రాజకీయాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో ఎంతోకాలం ఉండలేనని తాను గతంలోనే చెప్పానన్న విషయాన్ని చిరాగ్‌ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. బీహార్‌ రాష్ట్రం, బీహారీ ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చాను అంటున్న చిరాగ్‌ పాశ్వాన్‌ తన తొలి ప్రాధ్యాన్యత బీహార్‌ మాత్రమే అంటున్నారు. బీహార్‌ అభివృద్ధి చెందాలని, ఇతర అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీపడాలని ఎల్లప్పుడూ నేను కోరుకుంటానని… మూడోసారి ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో ఈ పని సాధ్యం కాదని నాకు అర్ధ' అని అన్నారు. చిరాగ్‌ పాశ్వాన్‌ ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. తన ఉద్దేశాన్ని పార్టీ పెద్దలకు ఇప్పటికే తెలియజేశానని ఆయన పేర్కొన్నారు. వీలైనంత త్వరగా తిరిగి బీహార్‌కు రావాలన్న నా ఆకాంక్షను పార్టీ ముందు ఉంచాను. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయడం పార్టీకి ఉపయోగపడుతుందా? అనే విషయంలో మా పార్టీ పరిశీలన చేస్తుమయ్యింది అంటున్నారు. నేను అసెంబ్లీ ఎన్నికల్లో మంచి సామర్థ్యం ప్రదర్శించగలనని, మా కూటమి కూడా సామర్థ్యం చాటుందని భావించినట్టయితే నేను అసెంబ్లీకి కచ్చితంగా పోటీ చేస్తాను' అని చిరాగ్‌ పాశ్వాన్‌ చెపుతున్నారు. చిరాగ్‌ పాశ్వాన్‌ రాజకీయ ఆకాంక్షలపై చాలా చర్చలే ఉన్నాయి. అయితే.. ఆయన మాత్రం ముఖ్యమంత్రి పదవి విషయంలో ఊహాగానాలను కొట్టిపారేస్తున్నారు. బీహార్‌లో ప్రస్తుతం సీఎం పోస్టు ఖాళీగా లేదు.. ఎన్నికల తర్వాత కూడా నితీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి అవుతారు అని ఆయన చెప్పారు. పాశ్వాన్‌ను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దింపే విషయంలో త్వరలోనే ఎల్జేపీ ఒక లాంఛన ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు. రిజర్వ్‌డ్‌ సీటు నుంచి కాకుండా జనరల్‌ స్థానం నుంచి పాశ్వాన్‌ పోటీ చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నదని ఎల్జేపీ బీహార్‌ ఇన్‌చార్జ్‌, జుమాయి ఎంపీ అరుణ్‌భారతి అన్నారు. చిరాగ్‌ ఏదో ఒక వర్గానికి మాత్రమే చెందిన నాయకుడు కాదు కనుక అతను జనరల్‌ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ భావిస్తున్నది అని ఆయన తెలిపారు. తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మరింత పెద్ద పాత్ర పోషించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు వెళతాయి' అని ఆయన పేర్కొన్నారు.జూన్‌ 8వ తేదీన భోజ్‌పూర్‌ జిల్లా అరాలో నవ్‌ సంకల్ప్‌ మహాసభ పేరిట పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిరాగ్‌ పాశ్వాన్‌ అసెంబ్లీకి పోటీ చేయడంపై లాంఛన ప్రకటన ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలపై కేంద్రీకరించాలని చిరాగ్‌ నిర్ణయించుకున్నారని, జాతీయ నాయకత్వ పాత్ర నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారని పార్టీ సీనియర్‌ నేతలు ధృవీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే మోదీ క్యాబినెట్‌ నుంచి కూడా ఆయన తప్పుకుంటారని తెలుస్తున్నది. బీహార్‌ అసెంబ్లీకి అక్టోబర్‌, నవంబర్‌ నెలల మధ్య మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ, జేడీయూ కూటమితోపాటు ఆర్జేడీ నేతృత్వంలోని కాంగ్రెస్‌, ఇతర పార్టీల ఇండియా కూటమి బరిలో ఉండగా.. తాజాగా ప్రశాంత్‌ కిశోర్‌ స్థాపించిన జన్‌ సూరజ్‌ పార్టీ కూడా సై అంటున్నది. ఈ ముక్కోణ పోటీలో గెలుపెవరిదన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News