Kharge: కాంగ్రెస్ ఒక శాశ్వత భావజాలం.. ఎన్నటికీ నాశనం కాదు: ఖర్గే

ఎన్నటికీ నాశనం కాదు: ఖర్గే

Update: 2025-12-29 11:41 GMT

Kharge: కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప సిద్ధాంతం. సిద్ధాంతాలకు మరణం ఉండదు. కాంగ్రెస్ పని అయిపోయిందని అనేవారికి నేను స్పష్టంగా చెప్పదలచుకున్నాను – మా శక్తి తాత్కాలికంగా తగ్గినా, మా వెన్నుదన్ను మాత్రం ఎప్పటికీ వంగదు’’ అని ఆయన ధీమాగా ప్రకటించారు.

ఆదివారం దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో జరిగిన 140వ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఖర్గే పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ గొప్ప నేతల ఫలితంగానే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచింది. రాజ్యాంగం, లౌకికవాదం, పేదల హక్కులపై కాంగ్రెస్ ఎన్నడూ రాజీపడలేదు. అధికారం లేనప్పుడు కూడా మేం బేరసారాలు చేసేవారం కాదు. మతం పేరుతో ఓట్లు అడగలేదు, మందిరం-మసీదు పేరుతో ద్వేషాన్ని రెచ్చగొట్టలేదు. కాంగ్రెస్ అందరినీ ఐక్యం చేస్తుంది, కానీ భాజపా విభజిస్తుంది’’ అని ఆయన విమర్శించారు.

భాజపాపై తీవ్ర స్థాయిలో మాట్లాడిన ఖర్గే, ‘‘మతాన్ని విశ్వాసంగా ఉంచిన మేం, కొందరు మాత్రం మతాన్ని రాజకీయ ఆయుధంగా మార్చారు. భాజపాకు ఇప్పుడు అధికారం ఉంది కానీ నిజాయితీ లేదు. అందుకే కొన్నిసార్లు డేటాను దాచేస్తారు, జనాభా గణనలు నిలిపేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తామంటారు’’ అని ఆరోపించారు.

స్వాతంత్ర్యం పొందిన సమకాలీన దేశాల్లో చాలాచోట్ల ప్రజాస్వామ్యం విఫలమైందని, కొన్నింటిలో నియంతృత్వం నెలకొన్నదని గుర్తుచేసిన ఖర్గే, భారతదేశంలో మాత్రం ప్రజాస్వామ్యం విలువైనదిగా నిలిచిందంటే దానికి కాంగ్రెస్ నేతలే కారణమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో ‘‘కాంగ్రెస్ అంటే భారతదేశానికి ఆత్మ’’ అని పోస్ట్ చేశారు.

Tags:    

Similar News