Delhi ATC Failure: దిల్లీ ఏటీసీ ఫెయిల్యూర్: జీపీఎస్ స్పూఫింగ్ అనుమానం.. అజిత్ డోభాల్ ఆఫీస్ దర్యాప్తు

అజిత్ డోభాల్ ఆఫీస్ దర్యాప్తు

Update: 2025-11-10 16:40 GMT

800 విమానాలకు అంతరాయం.. సైబర్ దాడి కోణంలో పరిశీలన

నకిలీ సిగ్నల్స్‌తో దారి మళ్లింపు.. డీజీసీఏ, ఏఏఐఐ భాగస్వామ్యం

ఎన్‌ఎస్‌ఏ కార్యాలయం రంగంలోకి.. దేశ భద్రతకు ముప్పు?

Delhi ATC Failure:  దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గతవారం సాంకేతిక లోపం కారణంగా సుమారు 800 విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. ఈ ఘటనకు రెండు రోజుల ముందు జీపీఎస్ స్పూఫింగ్ (నకిలీ జీపీఎస్ సిగ్నల్స్) జరిగి ఉండవచ్చన్న అనుమానాలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోభాల్ కార్యాలయం దర్యాప్తు చేపట్టింది.

దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే దిల్లీ ఐజీఐ ఎయిర్‌పోర్టు నుంచి రోజుకు 1,500కుపైగా విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డేటాతో అనుసంధానమైన ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (ఏఎంఎస్‌ఎస్)లో సాంకేతిక లోపం రావడంతో విమానాల షెడ్యూల్‌లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనకు ముందు కొందరు పైలట్లు తమకు తప్పుడు నావిగేషన్ డేటా అందినట్లు ఫిర్యాదు చేశారు. రాజధాని చుట్టుపక్కల 60 నాటికల్ మైళ్ల పరిధిలో ఇలాంటి సమస్య ఎదురైందని తెలిపారు.

ఎన్‌ఎస్‌ఏ కార్యాలయంలోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ (ఎన్‌సీఎస్‌సీ) ఈ దర్యాప్తును చేపట్టింది. ప్రస్తుతం ఎన్‌సీఎస్‌సీకి లెఫ్టినెంట్ జనరల్ (రిటై.) నవీన్ కుమార్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. స్పూఫింగ్ జరిగి ఉంటే దాని కారణాలు, పరిధి, సాంకేతిక లోపం వెనుక సైబర్ దాడి లేదా అంతర్జాతీయ జోక్యం ఉందా అనే అంశాలను లోతుగా పరిశీలిస్తున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐఐ) ఈ దర్యాప్తులో సహకారం అందిస్తున్నాయి.

జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఏమిటి?

నావిగేషన్ వ్యవస్థను మోసం చేసి, నకిలీ జీపీఎస్ సిగ్నల్స్ పంపి విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్ స్పూఫింగ్ అంటారు. అసలు శాటిలైట్ సిగ్నల్స్‌ను అడ్డుకుని, బదులుగా ఫేక్ సంకేతాలు పంపడం ద్వారా జీపీఎస్ రిసీవర్‌ను తప్పుదోవ పట్టిస్తారు. దీంతో స్థానం, సమయం తప్పుగా చూపించి విమానాలను ప్రమాదంలోకి నెట్టవచ్చు. పౌర విమానయాన రంగంలో అంతర్జాతీయ రూట్లలో ఇలాంటి సైబర్ దాడులు తరచూ నమోదవుతున్నాయి.

ఈ ఘటన దేశ భద్రతకు ముప్పుగా మారవచ్చన్న ఆందోళన నెలకొంది. దర్యాప్తు ఫలితాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.

Tags:    

Similar News