Vice President Elections : ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన ఈసీ
ఎలక్టోరల్ జాబితా సిద్దం… త్వరలో షెడ్యూల్ ప్రకటన;
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. తదుపరి ఉపరాష్ట్రపతిని ఎంపిక చేయడానికి సంబంధించిన ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంది. కాగా ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి బుధవారం పలు కీలక కార్యాచరణలను ప్రారంభించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన ఎంపీలు, నామినేట్ అయిన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ ఓటర్ల జాబితాను తయారు చేసినట్లు తెలిపింది. అదేవిధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను ఖరారు చేసేందుకు ఈసీ చర్యలు ప్రారంభించింది. త్వరలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తామని ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి.పవన్ వెల్లడించారు. నెల రోజులలోపే ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నట్లు సమాచారం.