Fire in Goods Train తమిళనాడులో గూడ్స్ రైలుకు అగ్ని ప్రమాదం
డీజిల్, పెట్రోల్ తో నిండి ఉన్న గూడ్స్ వ్యాగన్లు;
ఆయిల్ ట్యాంకర్లతో వెళుతున్న గూడ్సు రైలు తమిళనాడులో అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఆదివారం వేకువ జామున అరక్కోణం నుంచి చెన్నై డీజిల్, పెట్రోల్ లోడుతో వెళుతున్న గూడ్సు రైలులో తిరువళ్ళూరు సమీపంలోని పెరియ కుప్పం వద్ద మంటలు అంటుకున్నాయి. ఒక గూడ్స్ వ్యాగన్లో చెలరేగిన మంటలు క్షణాల్లో మొత్తం వ్యాగన్లకు వ్యాపించి భారీ యెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ అగ్నిప్రమాదానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ఇళ్ళను ఖాళీ చేయించారు. చెన్నై నుంచి తిరుపతి బెంగళూరు కోయంబత్తూర్ వైపుగా వెళ్ళే అన్ని రైళ్ళ రాకపోకలు నిలిపివేతశారు. దీంతో ఆ మార్గంలో రైళ్ళ సర్వీసులు ఆగిపోవడంతో రైల్వే ప్రయాణికులు ఇక్కట్లకు గురువుతున్నారు. ఇక గూడ్స్ రైలులో వ్యాగన్లను చుట్టుముట్టిన మంటలను ఆర్పడానికి ఆగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. వ్యాగన్లు అన్నింటిలో పెట్రోల్, డీజిల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిండి ఉండటంతో ఓ పట్టాన మంటలు అదుపులోకి రావడం లేదు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఓడరేవు నుంచి చమురుతో గూడ్స్ రైలు బయలుదేరింది. ఘటనా స్ధలానికి తిరువళ్ళూరు కలెక్టర్ ప్రతాప్, జిల్లా ఎస్పీ పెరుమాళ్, రైల్వే డీఆర్‌ఎం విశ్వనాథన్ లు చేరుకుని పరిస్ధితులను పర్యవేక్షిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన రైల్వే ట్రాక్ కి సమీపంలో ఉన్న తిరువళ్ళూరు ఎస్టీ కాలనీ, వరరాజు నగర్ లకు చెందిన దాదాపు 300 కుటుంబాలను అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.