జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరెస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు
మచైల్ మాత ఉత్సవాల్లో పాల్గొన్న 12 మంది భక్తులు మృతి;
క్లౌడ్ బరెస్ట్ కారణంగా ఆకస్మికంగా సంభవించిన వరదల కారణంగా జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో 12 మంది భక్తులు మరణించారు. గురువారం మధ్యాహ్నం జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్వారా జిల్లాలోని చషోటీ ప్రాంతంలో క్లౌడ్ బరెస్ట్ జరిగింది. దీంతో చషోటీ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వరదల్లో పన్నెండు మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. చషోటీలో ప్రతి సంవత్సరం జూలై 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకూ మచైల్ మాతా యాత్ర వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా మచైల్ మాత ఉత్సవాల్లో పాల్గొనడానికి భారీ స్ధాయిలో భక్తులు తరలివచ్చారు. ఈదశలో గురువారం క్లౌడ్ బరెస్ట్ జరగడంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డ వరదల్లో వందలాది మంది భక్తులు చిక్కుకుపోయారు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది చాలా మందిని రక్షించింది. వీరిలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.