విమాన ప్రమాదంపై అత్యున్నతస్థాయి దర్యాప్తు కమిటీ

High-level investigation committee into the plane crash

Update: 2025-06-14 05:35 GMT


అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది తేల్చడంతో పాటు.. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలన్న దానిపై ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. ఈమేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.



అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీలో పౌర విమానయాన శాఖ కార్యదర్శి, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, అహ్మదాబాద్ పోలీస్ కమీషనర్, డీజీ సివిల్ ఏవియేషన్, డీజీ బిసిఎస్, డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్ వంటి ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. కమిటీని మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.



ఈ కమిటీ విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలను, ప్రస్తుత ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు, భద్రతా మార్గదర్శకాలను సమీక్షించనుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను రూపొందించనుంది. ఈ కమిటీ విమాన డేటా, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు, ATC లాగ్, సాక్షుల వాంగ్మూలాలు వంటి అన్ని రికార్డులను యాక్సెస్ చేయగలదు. ప్రమాద సైట్ తనిఖీలు నిర్వహించి, సంబంధిత సిబ్బంది వాంగ్మూలాలు సేకరిస్తుంది. విదేశీ పౌరులు, విమాన తయారీదారులు, అంతర్జాతీయ సంస్థలకు సహకరిస్తుంది.



భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి ఉత్తమ అంతర్జాతీయ పద్ధతులను పరిశీలించి, సిఫార్సులు చేస్తుంది. విమాన ప్రమాద సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర ప్రతిస్పందనను అంచనా వేయడం, సహాయ చర్యలు, కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించనుంది. ఈ కమిటీ సంబంధిత సంస్థలు నిర్వహించే ఇతర విచారణలకు ప్రత్యామ్నాయంగా ఉండదు. స్వతంత్రంగా పనిచేస్తుంది.




Tags:    

Similar News