Women Welfare Scheme Funds In Bihar: బిహార్‌లో మహిళల పథకం డబ్బులు పురుషుల ఖాతాలకు.. తిరిగి రాబట్టేందుకు అధికారుల తలనొప్పి

తిరిగి రాబట్టేందుకు అధికారుల తలనొప్పి

Update: 2025-12-17 11:20 GMT

Women Welfare Scheme Funds In Bihar: బిహార్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నగదు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం మహిళలకు మాత్రమే పరిమితమైనది. అయితే సాంకేతిక లోపాల కారణంగా దర్భంగా జిల్లాలోని అహియారి గ్రామంలో కొందరు పురుషుల బ్యాంకు ఖాతాలకు కూడా ఈ మొత్తం జమ అయినట్లు గుర్తించారు.

ఈ పొరపాటు బయటపడిన వెంటనే జిల్లా అధికారులు, జీవికా (బిహార్ రూరల్ లైవ్లీహుడ్ ప్రమోషన్ సొసైటీ) అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ పురుషులకు నోటీసులు జారీ చేసి, జమ అయిన రూ.10 వేలను తిరిగి చెల్లించాలని ఆదేశించారు. అయితే ఈ డబ్బును ఇప్పటికే ఖర్చు చేశామని పురుషులు చెబుతున్నారు. కొందరు ఆ మొత్తంతో మేకలు, బాతులు కొన్నట్లు తెలిపారు. ఇప్పుడు తిరిగి ఇవ్వడం కుదరదని, తమ వద్ద అంత నగదు లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

దీంతో డబ్బు తిరిగి వసూలు చేయడం అధికారులకు తీరని తలనొప్పిగా మారింది. ఈ విషయంపై బిహార్ రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి శర్వణ్ కుమార్ స్పందించారు. జీవికా అధికారుల నుంచి వివరాల నివేదిక తీసుకుంటామని, ఇలాంటి లోపాలు ఎక్కడైనా జరిగితే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు గ్రామస్థులు ముఖ్యమంత్రి నీతీష్ కుమార్‌ను కోరుతూ.. అధికారుల తప్పిదం వల్ల జరిగిన ఈ ఘటనలో తమకు పడిన మొత్తాన్ని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటన బిహార్‌లో చర్చనీయాంశంగా మారింది. పథకాల అమలులో సాంకేతిక జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News