సీఈసీపై అభిశంసన పెట్టే యోచనలో ఇండియా కూటమి
సోమవారం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో అభిశంసనపై చర్చ;
ఓట్ల చోరీపై చేస్తున్న ఉద్యమంలో భాగాంగా ఇండియా కూటమి మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసనకు నోటీసు ఇవ్వాలనే ఆలోచనలో ఇండియా కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. ఓట్ల చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలపై సీఈసీ స్పందిస్తూ రాహుల్ చేసిన ఆరోపణలకు సబంధించి ఆధారాలు ఇవ్వాలని, ఇవ్వకుంటే దేశానికి క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీకి సీఈసీ అల్టిమేటం ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి కూడా సీఈసీ వైఖరిపై గుర్రుగా ఉంది. దీంతో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై లోక్‌సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లుగా సమాచారం. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆ తరువాత జరిగిన పలు రాష్ట్రా అసెంబ్లీల ఎన్నికల సందర్భంగా ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చెయ్యడమే కాకుండా దీనిపై ఒక ఉద్యమరూపాన్ని తీసుకువచ్చారు. అలాగే ఈ సంవత్సరం చివరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లోనూ లక్షల ఓట్లు తొలగించడం ద్వారా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని డైరెక్ట్‌గా ఎలక్షన్ కమిషన్‌పై రాహుల్‌గాంధీతో పాటు ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌కు ఆరోపణలు చేస్తున్నారు. అయితే వీరి ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా ధీటుగా స్పందించి ఆరోపణలను తిప్పికొడుతోంది. ఈ వ్యవహారంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీవ్రంగా స్పందించి వారం రోజుల్లోగా రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై అఫిడవిట్ సమర్‌పించాలని లేకపోతే ఈసీ తదురి చర్యలకు వెళతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సోమవారం పార్లమెంట్ సమావేశాలు పునఃప్రారంభానికి ముందు సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షత ఇండియా కూటమి పార్టీలు భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా సీఈసీపై అభిశంసన పెట్టాలనే చర్చ జరిగినట్లు సమాచారం.