Vise President Elections : ఇండియా కూటమి అభ్యర్ధిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
తమ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించిన ఇండియా కూటమి;
ఉపరాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి పోటీ పెట్టాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నిర్ణయించింది. తమ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి పోటీలో నిలిపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మగళవారం న్యూఢిల్లీలో ఈమేరకు ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించిన సుదర్శన్‌రెడ్డి 1993లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో ఆయన గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తదనంతరం 2007 జనవరి మాసంలో ఆయనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. నాలుగున్నర సంవతసరాల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన తరువాత సుదర్శన్‌రెడ్డి గోవా రాష్ట్రానికి మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ అంతర్జాతీయ అర్బిట్రేషన్ మీడియా సెంటర్ శాశ్వత ట్రస్టీగా బాధ్యతు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆయన్ను ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఖర్గే ప్రకటించడంతో ఆ పదవికి ఇప్పుడు తమిళ, తెలుగు రాష్ట్రాల మధ్య పోటీగా మారింది. ఎన్‌డీఏ కూటమి అభ్యర్ధి సీపీరాధాకృష్ణన్ స్వరాష్ట్రం తమిళనాడు.