Nitin Gadkari: హమాస్ చీఫ్ హనియా హత్యకు గంటల ముందే కలిశా.. షాక్ అయ్యా: నితిన్ గడ్కరీ

హత్యకు గంటల ముందే కలిశా.. షాక్ అయ్యా: నితిన్ గడ్కరీ

Update: 2025-12-25 06:19 GMT

Nitin Gadkari: హమాస్ సంస్థ అగ్రనేత ఇస్మాయిల్ హనియా ఇరాన్‌లో హత్యకు గురైన సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హనియా హత్య జరిగిన కొన్ని గంటల ముందే తాను ఆయన్ని కలిశానని, ఆ సంఘటన తర్వాత తీవ్ర షాక్‌కు గురైనట్లు తెలిపారు.

ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన గడ్కరీ... 2024లో జరిగిన తన ఇరాన్ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ‘‘ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రభుత్వం తరఫున హాజరు కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు టెహ్రాన్‌కు వెళ్లాను. అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో మాకు బస ఏర్పాటు చేశారు. అనధికారికంగా పలు దేశాల నేతలు, అధికారులు సమావేశమయ్యారు. వారిలో హమాస్ నేత ఇస్మాయిల్ హనియా ఒకరు. ఆయన ఏ దేశానికి ప్రతినిధి కాదు కానీ, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. నేను ఆయన్ని కలిశాను. ఇరాన్ అధ్యక్షుడు, చీఫ్ జస్టిస్‌తో పాటు హనియా కాన్వాయ్‌లో వెళ్తూ చూశాను.

కార్యక్రమం పూర్తయిన తర్వాత హోటల్‌కు తిరిగి వచ్చాను. మరుసటి రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో ఇండియాకు ఇరాన్ రాయబారి నా గదికి వచ్చి, వెంటనే బయలుదేరాలని చెప్పారు. ఏమైందని అడిగితే... హమాస్ చీఫ్ హత్యకు గురయ్యారని తెలిపారు. నేను తీవ్ర షాక్‌కు గురయ్యాను’’ అని గడ్కరీ వివరించారు.

2024 జులై 31న టెహ్రాన్‌లో హనియా హత్య జరిగిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం హనియా తన విలాసవంతమైన గెస్ట్‌హౌస్‌కు వెళ్లిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో హనియాతో పాటు ఆయన అంగరక్షకుడు కూడా మరణించాడు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది.

Tags:    

Similar News