Parliament monsoon session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

ఈ సమావేశాల్లో 15 బిల్లులపై చర్చ జరిగే అవకాశం;

Update: 2025-07-21 05:14 GMT

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు సోమవారం ప్రారంభమయ్యాయి. వచ్చే నెల ఆగస్టు 21 వరకు వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ కీలకమైన సమావేశంలో ప్రభుత్వం మొత్తం 15 బిల్లులను సభలో చర్చకు పెట్టడానికి సిద్దమయ్యింది. ఈ 15 బిల్లుల్లో 7 పెండింగ్‌ బిల్లులు ఉండగా మిగిలిన 8 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే కొత్తగా ప్రవేశపెట్టనుంది. ఈ వర్షకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న 15 బిల్లులను ఆమోదింప చేసుకోవడానికి కేంద్రప్రభుత్వం సిద్దమవుతోంది. 2024 ఎన్నికల అనంతరం కేంద్రంలో ఎన్‌డీఏ 3.o ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి పార్లమెంట్‌ ప్రధాన సమావేశం కావడంతో ఈ వర్షాకాల సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ భద్రత, ఆర్థిక సంస్కరణలు, సంక్షేమ విధాలు ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాల్లో చర్చలు జరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య, ఈమధ్య కాలంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక సంఘటనలు వంటి అనేక కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో చర్చకు లేవనెత్తే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించి నీటి వివాదాలపై కాంగ్రెస్‌ ఎంపీలు చర్చలకు పట్టుబట్టే అవకాశం ఉంది. మొత్తం మీద లోక్‌సభ, రాజ్యసభల్లో వేడి వేడి చర్చలు జరిగే పరిస్ధితి కనిపిస్తోంది. సోమవారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో పార్లమెంట్‌ భవనం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News