PM Modi Declares Nitish Kumar as NDA’s CM Candidate: పీఎం మోదీ: ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా నితీష్ ని ప్రకటించిన పీఎం మోడీ, తొలి ఎన్నికల సభలో కీలక వ్యాఖ్యలు
తొలి ఎన్నికల సభలో కీలక వ్యాఖ్యలు
PM Modi Declares Nitish Kumar as NDA’s CM Candidate: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అన్ని రికార్డులను ధ్వంసం చేస్తూ ఘన విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నేత నితీష్ కుమార్‌ను ఎన్‌డీఏ సీఎం అభ్యర్థిగా ఆమోదించిన ఆయన, శుక్రవారం సమస్తీపుర్ జిల్లా కర్పూరీ గ్రామంలో తొలి ప్రచార సభను ప్రారంభించారు.
విపక్ష మహాఘట్‌బంధంపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ఏళ్ల తరబడి బిహార్‌ను దోచుకుందని, ఇప్పుడు వారంతా బెయిల్‌పై ఉన్నారని ఆరోపించారు. బిహార్‌లో 'ఓటర్ అధికార్ యాత్ర'ను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంపీలు 'జన్‌నాయక్' అవ్వాలనుకుంటున్నారని, పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆర్‌జేడీ-కాంగ్రెస్ చేతులు కలిపినా బిహార్ అభివృద్ధిని ఆపలేరని స్పష్టం చేశారు.
2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బిహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్‌డీఏకు సహాయం చేయవద్దని ఆర్‌జేడీ బెదిరించిందని మోదీ ఆరోపించారు. 'కోట్లాది రూపాయలు కుంభకోణం చేసిన వీరే బెయిల్‌పై ఉన్నారు. కర్పూరీ ఠాకూర్ పేరును కూడా చోరీ చేసుకోవాలనుకుంటున్నారు. ఇలా అవమానం చేయడాన్ని బిహార్ ప్రజలు సహించరు' అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఎన్‌డీఏకు తిరిగి అవకాశం ఇవ్వమని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్ వృద్ధి రేటు మరింత వేగవంతమవుతుందని హామీ ఇచ్చారు. 'జంగిల్ రాజ్'ను తిరస్కరించి సుపరిపాలనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
బిహార్ వెలిగిపోతుంటే లాంతర్ ఎందుకు? అని ఆర్‌జేడీ లాంతరు గుర్తును ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ లైట్లు ఆన్ చేసుకోవాలని సూచించారు. బిహార్ అసెంబ్లీకి 243 స్థానాలకు రెండు దశల్లో నవంబర్ 6, 11 తేదీల్లో ఓటర్లు ఓటు వేస్తారు. 14న ఫలితాలు వెల్లడవుతాయి.