RBI: ఆర్‌బీఐ హై-వాల్యూ లావాదేవీ: 4.61 ఎకరాల భూమికి రూ.3,472 కోట్లు
4.61 ఎకరాల భూమికి రూ.3,472 కోట్లు
RBI: ముంబయిలోని నారీమన్ పాయింట్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 4.61 ఎకరాల భూమిని రూ.3,472 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ భూమిని ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్) నుంచి సొంతం చేసుకుంది. ఈ ఏడాది భూమి కొనుగోళ్లలో ఇది అత్యధిక ధరగల ఒప్పందంగా వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ భూమి మంత్రాలయ, బాంబే హైకోర్టు, పలు కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలకు సమీపంలో ఉంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ భూమిని వేలం వేయాలని మొదట యోచించింది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ ప్రణాళికను రూపొందించింది. 1970లలో నారీమన్ పాయింట్ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తర్వాత ఇది మొదటి పెద్ద భూమి వేలం కావాల్సి ఉంది. అయితే, ఆర్‌బీఐ తమ ప్రధాన కార్యాలయాన్ని విస్తరించేందుకు ఆసక్తి చూపడంతో ఈ వేలం రద్దయింది. సెప్టెంబర్ 5న ఈ ఒప్పందం రిజిస్టర్ అయింది. ఈ డీల్ కోసం రూ.208 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం.
ఈ భూమి కొనుగోలుతో ఆర్‌బీఐ ముంబయి రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో తన ఆస్తులను విస్తరించింది. ఆర్‌బీఐకి ఇప్పటికే మింట్ రోడ్‌లో ప్రధాన కార్యాలయం సహా ఇతర ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేసిన భూమిని సంస్థాగత అవసరాల కోసం అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఈ చర్య భారత ఆర్థిక రాజధానిలో కేంద్ర బ్యాంకు ఉనికిని మరింత బలోపేతం చేస్తుంది. మరోవైపు, ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ నగరంలో మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు దక్షిణ, మధ్య ముంబయిలోని విలువైన భూములను విక్రయిస్తోంది. ఈ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయంతో కొత్త ప్రాజెక్టులను నిర్వహించనుంది.