Amit Shah: పార్లమెంటు సమావేశాల్లో నిరంతర ప్రతిష్టంభన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బుధవారం స్పందించారు. నీట్‌ (NEET) పరీక్ష వివాదం, దాని అనంతరం దేశవ్యాప్తంగా చెలరేగిన విద్యార్థుల ఆందోళనలు, ఢిల్లీలో జరిగిన లాఠీఛార్జి ఘటనలపై సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు అధికారిక లేఖ రాశారు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ఇప్పటికే ప్రభుత్వం తరఫున నీట్‌ అంశంపై చర్చకు అంగీకారం తెలిపారని లేఖలో గుర్తుచేశారు. ప్రస్తుత సమావేశాల్లోనే ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు, 2026’పై సుదీర్ఘ చర్చ జరిగినప్పటికీ, ప్రతిపక్ష ఎంపీలు నీట్‌ విషయంపై మాట్లాడలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మరోసారి ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని తెలిపారు.

‘‘విపక్షాలతో చర్చించి, పరస్పర అంగీకారంతో ఎంత సమయం కావాలంటే అంత సమయం కేటాయించాలి. కేటాయించిన సమయంలో నేను స్వయంగా సభలో ఉండి చర్చలో పాల్గొని, ప్రతిపక్షాల ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తాను’’ అని షా లేఖలో రాశారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, సంభాషణల ద్వారానే పరిష్కారాలు లభిస్తాయని, ఈ సభ చర్చల కోసమే ఉందని తన నమ్మకం వ్యక్తం చేశారు.

విలేకరులతో మాట్లాడుతూ షా మరోసారి చర్చకు సిద్ధమని చెప్పారు. ప్రతిపక్షం చర్చ కోరుతే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు, అవసరమైతే గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా చర్చ కొనసాగించేందుకు తాను సిద్ధమన్నారు. చర్చకు సిద్ధమైన ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్‌కు లేఖ రాయాలని సూచించారు. సభలో ‘‘కనిపించడం లేదు’’, ‘‘పారిపోయారు’’ వంటి పదాలు ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఢిల్లీ విద్యార్థుల లాఠీఛార్జి ఘటనపై చర్చకు రావాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని సవాల్‌ చేశారు.

చర్చ జరగాలా? ఆందోళన కొనసాగాలా? అనేది ప్రతిపక్షమే నిర్ణయించుకోవాలని అమిత్‌ షా స్పష్టం చేశారు.

Tags: