Shashi Tharoor: రాహుల్‌, ఖర్గేలతో శశిథరూర్‌ కీలక భేటీ: కాంగ్రెస్‌లో అసంతృప్తి చర్చలు?

కాంగ్రెస్‌లో అసంతృప్తి చర్చలు?

Update: 2026-01-29 11:51 GMT

Shashi Tharoor: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు ప్రముఖ నేత రాహుల్‌ గాంధీలతో ఆయన సమావేశమయ్యారు. పార్లమెంట్‌ భవనంలో సుమారు 30 నిమిషాల పాటు ఈ ముగ్గురు నేతల మధ్య ముచ్చట్లు జరిగాయి.

ఈ భేటీకి ముందు విలేకరులు థరూర్‌ను రాహుల్‌తో సమావేశం గురించి అడిగినప్పుడు, 'అది జరగాల్సిన సమయంలో జరుగుతుంది' అని సమాధానమిచ్చారు. తన సొంత పార్టీ నేతను కలవడంలో పెద్ద విషయమేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, 'మా మధ్య సానుకూల చర్చలు జరిగాయి. అంతా సవ్యంగా ఉంది. మేమంతా ఒకే దిశలో ముందుకు సాగుతున్నాం' అని థరూర్‌ తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోను ఆయన ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు. 'వివిధ అంశాలపై ఆత్మీయంగా, సానుకూలంగా మాట్లాడినందుకు ఖర్గే మరియు రాహుల్‌ గాంధీలకు కృతజ్ఞతలు. దేశ ప్రజల సేవకు ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం' అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

గత సంవత్సరం 'ఆపరేషన్‌ సిందూర్‌' తర్వాత దౌత్య సంబంధాలపై థరూర్‌ తన పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా, పలు సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించడం కూడా వివాదాలకు దారి తీసింది. పార్టీతో తనకు కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ, పార్లమెంటులో పార్టీ నిబంధనలను ఎప్పుడూ ఉల్లంఘించలేదని థరూర్‌ ఇటీవల చెప్పారు. ఈ నేపథ్యంలో జరిగిన తాజా సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత సమస్యలు పరిష్కారమవుతాయా లేక మరిన్ని మలుపులు తిరుగుతాయా అనేది చూడాలి.

Tags:    

Similar News