Army Chief General Upendra Dwivedi: సీమాంతర ఉగ్రవాదం ఆపకపోతే అస్తిత్వమే మాయం: పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ హెచ్చరిక

పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ హెచ్చరిక

Update: 2025-10-03 12:24 GMT

Army Chief General Upendra Dwivedi: పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఇకనైనా ఆపకపోతే ఆ దేశం భౌగోళిక, చారిత్రక అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్‌లో ఆర్మీ పోస్టును సందర్శించిన సందర్భంగా ఆయన సైనికులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో భారత్ కాస్త సహనాన్ని ప్రదర్శించిందని, కానీ ఇకముందు అలా జరగదని జనరల్ ద్వివేది స్పష్టం చేశారు. పాకిస్థాన్ మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే సిందూర్ 2.0 వంటి భారీ దెబ్బ తప్పదని హెచ్చరించారు. "భౌగోళిక చరిత్రలో ఉండాలనుకుంటే ప్రపంచపటంలో స్థానం కావాలంటే సీమాంతర ఉగ్రవాదాన్ని వెంటనే ఆపాలి. లేదంటే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకోవాల్సి వస్తుంది" అని ఆయన గట్టిగా చెప్పారు. ఏవైనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు సైనికులు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

పశ్చిమ సరిహద్దులో పాక్ చురుకు: భారత్‌కు పశ్చిమాన ఉన్న సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా పాక్ తన వైఖరిని మార్చుకోకపోవడంతో భారత్ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. జమ్మూ-కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు పాక్ మద్దతు ఉందని భారత్ ఆరోపిస్తోంది.

భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో కలకలం రేపుతున్నాయి. పాక్ మీడియాలో ఈ హెచ్చరికలు ప్రముఖంగా ప్రసారమవుతున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో భారత్ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News