Supreme Court Expresses Anger: సుప్రీంకోర్టు ఆగ్రహం: తాగునీటే లేని వారి కోసం ఆలోచించండి.. బాటిల్ వాటర్ నాణ్యతపై పిటిషన్ ఎందుకు?
బాటిల్ వాటర్ నాణ్యతపై పిటిషన్ ఎందుకు?
Supreme Court Expresses Anger: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (బాటిల్ నీరు) నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపర్చాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దేశంలో ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత తాగునీరు కూడా అందుబాటులో లేదని, ఇలాంటి ‘లగ్జరీ’ అంశాలపై వ్యాజ్యాలు అనవసరమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ‘‘ఇది నగరాల్లోని ధనవంతుల మనస్తత్వాన్ని ప్రతిబింబించే పిటిషన్. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మిలియన్ల మంది శుద్ధి చేయని నీటిపై ఆధారపడుతున్నారు. ముందు వారి సమస్యలు పరిష్కరించుకుందాం. బాటిల్ నీటి నాణ్యత గురించి తర్వాత చూసుకుందాం’’ అని ధర్మాసనం గట్టిగా వ్యాఖ్యానించింది.
అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాల మార్గదర్శకాలను భారత్‌లో అమలు చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై ధర్మాసనం, ‘‘భారత్ యథార్థ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. గాంధీజీ దేశానికి వచ్చినప్పుడు మారుమూల గ్రామాలను సందర్శించారు. మీరు కూడా అలాంటి ప్రాంతాలకు వెళ్లి, అక్కడి ప్రజలు తాగునీటి కోసం పడుతున్న కష్టాలను చూడండి. అప్పుడు దేశం గురించి నిజమైన అవగాహన కలుగుతుంది’’ అని పిటిషనర్‌కు సలహా ఇచ్చింది.
ఈ తీర్పుతో సుప్రీంకోర్టు మరోసారి దేశంలోని అసమానతలను, ప్రాధాన్యతలను గుర్తు చేసింది.