RJD Tejaswi Yadav : ఏ స్థానంలో ఏ పార్టీ గెలవాలో ఈసీ నిర్ణయిస్తోంది…
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు;
త్వరలో బీహార్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ స్ధానం నుంచి ఏ పార్టీ గెలుపొందాలనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తోందని రాష్ట్రీయ జనతా దళ్ నేత, బీహార్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఈసీపై సంచలన ఆరోపణలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలను నితీష్ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలచుకుంటోందని తేజస్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్ పేరుతో పూర్తిగా తప్పుల తడకగా ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకునే వారని కానీ ఇప్పుడు ఈసీ సహకారంతో ప్రభుత్వాలు ఓటర్లను ఎన్నుకుంటున్నాయని తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బీహార్ లో ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించే యోచనలో ఉన్నట్లు తేజస్వి ప్రకటించారు. ఈ విషయంపై భాగస్వామ్య పక్షాలతో పాటు విస్తృత ప్రజాభిప్రాయం తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని తేజస్వియాదవ్ చెప్పారు.