Vise President of India : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా
అనారోగ్య కారణాలతో రాజీనామా అని ప్రకటన;
దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి ఆకస్మాత్తుగా రాజీనామా చేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఆయన ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. అనారోగ్య కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 2022 ఆగష్టు 11వ తేదీన ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన జగదీప్ ధన్‌ఖడ్ ఆ పదవిలో మూడు సంవత్సరాల పాటు కొనసాగురు. ఇంకా రెండు సంవత్సరాల పదవీ కాలం ఉండగా ఆయన రాజీనామా చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి కాక ముందు ఆయన పశ్చిమబెంగాల్ గవర్నర్ గా వ్యవహరించారు. ఆ సందర్భలో ఆయనకూ మమత బెనర్జీ ప్రభుత్వానికి తరచూ వివాదాలు చోటుచేసుకుంటూ ఉండేవి.
ఇదిలా ఉండగా జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం పట్ల కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాజ్యసభ కొలువుతీరిన తరువాత మధ్యాహ్నం 12.30 గంటలకు జగదీప్ ధన్‌ఖడ్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగిందని, ఈ సమావేశానికి రాజసభా పక్ష నేత జేపీనడ్డాతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు కూడా హాజరైయ్యారని, ఆ సమావేశంలో కొంత సమయం రాజ్యసభ బిజినెస్ గురించి చర్చ జరిగిందని, మళ్ళీ సాయంత్రం 4.30 గంటలకు సమావేశం అవుదామని అనుకున్నామని జైరామ్ రమేష్ తెలిపారు. అయితే సాయంత్రం సమావేశానికి జేపీనడ్డా, కిరణ్ రిజుజు ఇద్దరూ హాజరుకాకపోవడంతో కొంత సమయం వేచి చూసి మంగళవారం మధ్యాహ్నాం 1గంటకు బీఏసీ సమావేశాన్ని వాయిదా వేశారని చెపుతున్న జైరామ్ రమేష్ ఈ మధ్యలోనే ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య కారణాల వల్ల తాను రాజీనామా చేసినట్లు జగదీప్ ధన్‌ఖడ్ చెప్పిన విషయాన్ని తాము గౌరవిస్తామని, కానీ తెరవెనుక వేరే కారణాలు ఉన్నట్లు అనుమానంగా ఉందని జైరామ్ రమేష్ తన అభిప్రాయాలను ఎక్స్ వేదికగా వ్యక్తం చేశారు.