TVK Chief Vijay: విజయ్: కరూర్ తొక్కిసలాట బాధితులకు రూ.20 లక్షల పరిహారం ప్రకటన
బాధితులకు రూ.20 లక్షల పరిహారం ప్రకటన
TVK Chief Vijay: టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ఒక ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన విషాదకరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో విజయ్ (Vijay) బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు.
కరూర్ ఘటనపై టీవీకే అధికారిక ఎక్స్ ఖాతాలో విజయ్ మరోసారి స్పందించారు. తన హృదయం ఇప్పటికీ భారంగా ఉందని, తనను ఇష్టపడే వారిని కోల్పోవడం వల్ల కలిగిన బాధను వ్యక్తీకరించడానికి మాటలు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార సమయంలో అభిమానుల ముఖాల్లో కనిపించిన ఆనందం తన కళ్లముందు ఇప్పటికీ కదలాడుతోందన్నారు. ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తాను కూడా మోస్తున్నానని, ఇది తమకు కోలుకోలేని నష్టమని విజయ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు అందజేస్తామని ప్రకటించారు. ఈ ఆర్థిక సాయం బాధితుల బాధను తీర్చలేదని, అయినప్పటికీ వారిలో ఒకడిగా అండగా నిలబడటం తన బాధ్యత అని విజయ్ వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
సినీ నటుల సానుభూతి...
కరూర్‌లోని తొక్కిసలాట ఘటనపై సినీ నటులు రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. బాధిత కుటుంబాలు అనుభవిస్తున్న భర్తీ చేయలేని నష్టానికి, కష్టానికి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ విషమ పరిస్థితుల్లో వారికి బలం చేకూరాలని కోరుకున్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.