Jagadeep Dhankhad : జగదీఫ్‌ ధన్‌ఖర్ రాజీనామా వేనుక కారణాలివేనా…!

ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నది వీరేనా...;

Update: 2025-07-22 07:08 GMT

జగదీప్‌ ధన్‌ఖర్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇంకా రెండు సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ ధన్‌ఖడ్‌ అకస్మాత్తుగా రాజీనామా చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ధన్‌ఖర్ పైకి తన రాజీనామాకు కారణం అనారోగ్యమని చెపుతున్నప్పటికీ దానికి మించి వేరే రాజకీయ కారణం ఉందని ప్రతిపక్షాలతో పాటు అధికార పక్ష నేతలు కూడా చెవులు కొరుక్కొంటున్నారు. సరిగ్గా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే జగదీప్‌ ధన్‌ఖర్ రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకోవడం వెనుక ఏమన్నా రాజకీయ కోణం ఉందా అని విపక్షాలు అన్వేషణ ప్రారంభించాయి. వాస్తవానికి నిన్న సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభైన తరువాత మధ్యాహ్నం 12.30 గంటలకు బిజినెస్‌ అడ్వైజరీ సమావేశంలో కూడా ధన్‌ఖర్ ఉత్సాహంగానే పాల్గొన్నారని, రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన నుంచి ఎటువంటి సంకేతాలు లేవని కాంగ్రెస్‌ పక్ష రాజ్యసభ సభ్యులు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సోమవారం 12.30 గంటలకు జరిగిన బిజినెస్‌ అడ్వైజరీ సమావేశంలో ఎజెండా ఓ కొలిక్కి రాకపోవడంతో సాయంత్రం 4.30 గంటలకు మరోసారి సమావేశం కావాలని కూడా జగదీప్‌ ధన్‌ఖర్ నిర్ణయించారని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు జైరామ్‌ రమేష్‌ అంటున్నారు.

అయితే సాయంత్రం జరిగిన బీఏసీ సమావేశానికి బీజేపీ రాజ్యసభ పక్ష నేత జేపీనడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజుజుల కోసం గంట సేపు వేచి ఉన్నా వారు రాకపోవడం పట్ల జైరామ్‌ రమేష్‌ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఏదో జరిగిందని… అదే జగదీప్‌ ధన్‌ఖర్ రాజీనామాకు దారితీసిందని జైరామ్‌ రమేష్‌ అంచనా వేస్తున్నారు. అయితే నిన్న రాజ్యసభలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పార్టీ ఎన్‌డీఏ కూటమిలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యుల నుంచి సంతకాలు సేకరించినట్లు ఒక ప్రచారం జరుగుతోంది. ఈ సంతకాల సేకరణకు జగదీప్‌ ధన్‌ఖర్ రాజీనామాకు సంబంధం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమని విపక్షాలు అంటున్నాయి. ఇలా అర్ధంతరంగా రాజీనామా చేయాలని జగదీప్‌ ధన్‌ఖర్ నిర్ణయం తీసుకోవడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉండే ఉంటాయని రాజకీయ వర్గాలు నమ్ముతున్నాయి.

ఇదిలా ఉండగా భవిష్యత్‌ రాజకీయ అవసరాల దృష్ట్యా… వేరెవరినో అర్జెంటుగా ఉపరాష్ట్రపతిని చేయడం కోసమే జగదీప్‌ ధన్‌ఖర్ తప్పనిసరి పరిస్ధితుల్లో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఢిల్లీ రాజకీయాలు కోడై కూస్తున్నాయి. ఆ వేరెవరో ఎవరనే విషయంపైన ఇప్పుడు దేశ రాజధానిలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ధన్‌ఖర్ రాజీనామాపై ఢిల్లీలొ ఎవరికి తోచిన కంక్లూజన్లు వారు డ్రా చేసుకుంటున్నారు. రాజధాని సర్కిళ్లలో ప్రధానంగా వినిపిస్తున్న కారణం బీహార్‌ ఎన్నికలు. త్వరలో జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల అవసరాల కోసం జగదీప్‌ ధన్‌ఖర్ రాజీనామా చేయాల్సి వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం బీహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్‌ కుమార్‌ ని ఉపరాష్ట్రపతిగా చేయడం కోసమే జగదీఫ్‌ ధన్‌ఖర్ రాజీనామా చేయాల్సి వచ్చిందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. నితీష్‌ ఉపరాష్ట్రతి అయితే వచ్చే సంవత్సరం జరిగే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి లైన్‌ క్లియర్‌ అవుతుందనే ఉద్దేశంతో ఈ రాజకీయపుటెత్తుగడ వేశారని అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్త మవుతోంది.

ఇక ధన్‌ఖర్ రాజీనామా విషయంలో వినిపిస్తున్న రెండో కారణం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి చాలా ఉత్సుకతతో ఉన్నారు. ఈ మధ్య కాలంలో చంద్రాబాబే కాకుండా నారా లోకేష్‌ సైతం ఢిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్‌ కి లైన్‌ క్లియర్‌ చెయ్యడానికి చంద్రబాబును ఉపరాష్ట్రపతిని చేస్తారనే వాదన కూడా ఉంది. దీనికి చంద్రబాబు సైతం సుముఖంగానే ఉన్నట్లు తెలుగుదేశం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ కాదు అలహాబాద్‌ కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను తొలగించాలని విపక్షాలు ఇచ్చిన తీర్మానాలను జగదీప్‌ ధన్‌ఖర్ రాజ్యసభలో చర్చకు అనుమతించినందుకు బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉందని, ఈ కారణంతోనే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ధన్‌ఖర్ తరువాత ఉప రాష్ట్రపతి పదవికి ప్రస్తుతం రాజ్యసభ వైస్‌ చైర్మన్‌ గా ఉన్నహరివంశ్‌ నారాయణ సింగ్‌ తో పాటు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా భారత దేశంలో ఇంతగా రాజకీయపరంగా సంచలనం అయిన విషయం వేరొకటి లేదు.

Tags:    

Similar News