మే డే కాల్ అంటే...?
బుధవారం అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జగడానికి ముందు పైలట్ సుమిత్ సభర్వాల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ని సంప్రదించి మేడే… మేడే… మేడే అని మూడు సార్లు సిగ్నల్ ఇచ్చారు. ఆ సిగ్నల్ ఏటీసీ రిసీవ్ చేసుకునే కాంటాక్ట్ చేసేలోపే విమానం కుప్పకూలిపోయింది. అయితే ఇంతకీ మేడే అంటే ఏంటనే సందేహం చాలా మందికి కలిగింది. విమానయాన రంగంలో మేడే కాల్ అంటే అత్యంత తీవ్రమైన సమస్యలో విమానం ఇరుక్కున్నట్లు సంకేతం. పైలట్ ఈ విధంగా ఏటీసీ కి మేడే కాల్ చేస్తే విమానం పూర్తిగా అతని కంట్రోల్ తప్పినట్లు అధికారులు భావిస్తారు. విమానం తీవ్రమైన సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు పైలట్లు మేడే అంటూ ఏటీసీకి సంకేతాలు పంపుతారు. వాస్తవానికి మాయిడేర్ అనే ఫ్రంచ్ పదం నుంచి మేడే అనే పదం వచ్చింది. మాయిడేర్ (Maider) అనే పదానికి ప్రాణాంతక పరిస్ధితులు ఉన్నాయి మాకు సహాయం చెయ్యండి అని అర్ధం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం సమయంలో కూడా పైలెట్ మేడే కాల్ అలర్ట్ ఏటీసీకి ఇచ్చారు.
మే డే కాల్ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్ట్రెస్ సిగ్నల్, ఇది విమానం లేదా దాని ప్రయాణీకులకు తీవ్రమైన ప్రమాదం ఉన్న సందర్భాల్లో అంటే ఇంజిన్ వైఫల్యం, అగ్ని ప్రమాదం లేదా హైజాక్ వంటివి విపత్కర పరిస్ధితులు ఎదురైనప్పుడు ఏటీసీకి గానీ సమాపంలో ఉన్న ఇతర విమనాలకు గానీ పైలట్లు మేడే కాల్ సంకేతాలు పంపుతారు. మూడు సార్లు స్పష్టంగా ఈ మేడే కాల్ ఏటీసీకి అందించిన తరువాత విమానం గుర్తింపు నెంబరు, ఎక్కడ ఉన్నది, సమస్య ఏంటి, ఎటువంటి సహాయం అవసరం అనే వివరాలు ఏటీసీకి తెలుపుతారు. మేడే కాల్ అంటేనే అత్యవసర సందేశమని అర్ధం. ఈ సందేశం అందుకున్న ఏటీసీ సిబ్బంది సదరు ప్రమాదంలో ఉన్న ఫ్లైటుకి అందించాల్సిన అన్ని వనరులు సమీకరించి సహాయక చర్యలు తక్షణం ప్రారంభిస్తారు. ఇదే తీవ్రత తక్కువగా ఉన్న సమస్యలైతే పైలట్ పాన్.. పాన్ అనే సంకేతాలు పంపుతాడు.