TCS New Rules : ఐటీ ఉద్యోగులకు కొత్త నిబంధనలు..కంపెనీ, ఉద్యోగులకు లాభమేమిటి?

కంపెనీ, ఉద్యోగులకు లాభమేమిటి?;

Update: 2025-06-18 03:21 GMT

TCS New Rules : భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), తన ఉద్యోగుల బెంచ్ టైమ్ పాలసీని అప్‌డేట్ చేసింది. ఈ కొత్త పాలసీ ప్రకారం.. ప్రతి ఉద్యోగికి ఒక సంవత్సరంలో కనీసం 225 'యాక్టివ్ వర్క్ డేస్' లేదా 'బిల్డ్ బిజినెస్ డేస్' ఉండాలి. అంటే, ఉద్యోగిని సంవత్సరంలో 225 రోజుల కంటే ఎక్కువ రోజులు యాక్టివ్ ప్రాజెక్టులలో ఉపయోగించుకోవాలి. అలాగే, ఒక ఉద్యోగి బెంచ్ టైమ్ ఒక సంవత్సరంలో 35 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ కొత్త విధానాన్ని టీసీఎస్ జూన్ 12 నుంచే అమలులోకి తెచ్చింది.

ఐటీ కంపెనీలలో బెంచ్ టైమ్ అంటే ఏమిటి?

బెంజ్ టైమ్ అంటే..ఒక ఉద్యోగి యాక్టివ్ ప్రాజెక్టులలో నిమగ్నమై లేకుండా ఖాళీగా ఉండే సమయం. వివిధ ప్రాజెక్టులపై పనిచేస్తున్న కంపెనీలలో కొందరు ఉద్యోగులు ప్రాజెక్టులు లేక ఖాళీగా ఉండటం సర్వసాధారణం. ఐటీ రంగంలో ఇది చాలా సాధారణంగా జరుగుతుంది.'బిల్డ్ బిజినెస్ డే' అంటే, కంపెనీకి ఆదాయం తెచ్చే క్లయింట్ ప్రాజెక్టులపై పని జరుగుతున్న రోజు. ఆ రోజు పని ద్వారా కంపెనీకి ఆదాయం లభిస్తుంది.

ఉద్యోగిని బెంచ్‌లో ఉంచడానికి కారణాలు ఏమిటి?

తగినన్ని ప్రాజెక్టులు అందుబాటులో లేనప్పుడు, ఉద్యోగి నైపుణ్యాలకు తగిన ప్రాజెక్ట్ లభించనప్పుడు, ఉద్యోగికి యాక్టివ్ పనికి అవసరమైన నైపుణ్యాల కొరత ఉన్నప్పుడు, ఉద్యోగి ఇంకా పూర్తిగా సిద్ధంగా లేనప్పుడు ఉద్యోగిని బెంచ్ టైమ్ లో ఉంచుతారు.

"ఎటువంటి పని కేటాయింపు లేకుండా ఎక్కువ కాలం ఖాళీగా ఉంటే ఉద్యోగి కెరీర్‌కు ఆటంకం కలుగుతుంది. కంపెనీలో అతనిని కొనసాగించడం కష్టం అవుతుంది. కాబట్టి, సంవత్సరంలో కనీసం 225 రోజులు ఉద్యోగిని యాక్టివ్ ప్రాజెక్టులకు ఉపయోగించుకోవాలి" అని టీసీఎస్ విధానంలో పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.

ఇతర ఐటీ కంపెనీలలో బెంచ్ పాలసీ ఎలా ఉంది?

ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్, కాగ్నిజెంట్ వంటి చాలా ఐటీ కంపెనీలలో ఉద్యోగి బెంచ్ టైమ్ ఒక సంవత్సరానికి 35-45 రోజులు ఉంటుంది. అయితే, ఒక ఉద్యోగి ఒక సంవత్సరంలో 60 రోజులు బెంచ్ టైమ్‌లో గడిపితే అతడిని ఉద్యోగంలో కొనసాగించే అవకాశం తక్కువగా ఉంటుంది.

బెంచ్‌లో ఉన్న ఉద్యోగులకు ఈ సమయాన్ని తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వారికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. ఇంటర్నల్ ప్రాజెక్టులలో యాక్టీవ్ గా పాల్గొనవచ్చు. దీని ద్వారా కంపెనీలోని ముఖ్యమైన ప్రాజెక్టులకు వారిని పరిగణనలోకి తీసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.ఈ కొత్త పాలసీ ద్వారా టీసీఎస్ తమ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచాలని, ప్రాజెక్టుల మధ్య ఖాళీ సమయాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Tags:    

Similar News