ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ సరికొత్త చరిత్ర: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్ 6లోకి ఎంట్రీ
తొలిసారి టాప్ 6లోకి ఎంట్రీ
ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ యవనికపై ఆఫ్ఘనిస్తాన్ జైత్రయాత్ర మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. అసాధారణ ఆటతీరు, నిలకడైన ప్రదర్శనలతో దూసుకుపోతున్న ఆఫ్ఘన్ జట్టు ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో సరికొత్త చరిత్ర లిఖించింది. ప్రపంచ మాజీ ఛాంపియన్లైన శ్రీలంక, ఇంగ్లాండ్, వెస్టిండీస్ వంటి దిగ్గజ జట్లను వెనక్కి నెట్టి, తొలిసారిగా 6వ ర్యాంకుకు ఎగబాకింది. 50 ఓవర్ల ఫార్మాట్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్ కావడం విశేషం.
2009లో మొదలైన ప్రస్థానం.. నేడు తిరుగులేని శక్తిగా
2009లో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఆఫ్ఘనిస్తాన్, అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన, సమర్థవంతమైన జట్లలో ఒకటిగా ఎదిగింది. ఇప్పటివరకు ఆడిన 191 వన్డే మ్యాచ్‌లలో ఏకంగా 96 విజయాలను నమోదు చేసి, 1.09 గెలుపు-ఓటముల నిష్పత్తితో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇప్పటికే బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్‌లను దాటేసిన ఆఫ్ఘన్లు, తాజాగా శ్రీలంకను కూడా వెనక్కి నెట్టి ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
వరల్డ్ కప్ సంచలనాల నుంచి టీ20 సెమీస్ దాకా..
2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్, శ్రీలంక వంటి మేటి జట్లను మట్టికరిపించిన ఆఫ్ఘనిస్తాన్.. ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకుంది. అదే జోరును కొనసాగిస్తూ 2024 టీ20 ప్రపంచకప్‌లో చరిత్రలోనే తొలిసారిగా సెమీఫైనల్స్‌కు చేరి సంచలనం సృష్టించింది. పెద్ద వేదికలపై ఎలాంటి జట్లనైనా ఓడించగల సత్తా తమకు ఉందని నిరూపించింది.
నిరంతర విజయాల పరంపర
ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ సాధించిన వరుస విజయాలే ఈ ర్యాంకింగ్స్ మెరుగుపడటానికి ప్రధాన కారణం. విదేశీ గడ్డపై ఐర్లాండ్‌ను 4-0 తేడాతో చిత్తు చేసి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత జింబాబ్వే, బంగ్లాదేశ్‌లతో జరిగిన ట్రై-సిరీస్‌లోనూ అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. పొట్టి ఫార్మాట్లోనూ తమ దూకుడును కొనసాగిస్తూ, షార్జా వేదికగా జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గి జింబాబ్వేపై 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తిరుగులేని విజయాలతో అదరగొట్టిన ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా సుదీర్ఘ ఫార్మాట్‌పై దృష్టి సారించింది. జింబాబ్వేతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతోంది.