India A Squad: ఖతార్ రాజధాని దోహా వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత ఎ జట్టును అధికారికంగా ప్రకటించింది. సెలక్షన్ కమిటీ యువ సంచలనం తిలక్ వర్మకు జట్టు పగ్గాలు అప్పగించగా, అనుభవజ్ఞుడైన రజత్ పాటిదార్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. జట్టులో విధ్వంసకర ఓపెనర్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లతో పాటు బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కింది. మిడిలార్డర్‌లో ఫినిషర్ రింకు సింగ్, వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర స్థానం సంపాదించారు. అయితే ఢిల్లీ లీగ్‌లో దుమ్మురేపిన ప్రియాన్ష్ ఆర్యకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. ఇక బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణా, తనుష్ కోటియన్, షాబాజ్ అహ్మద్‌లు బాధ్యతలు మోయనున్నారు.

టోర్నీ షెడ్యూల్ - గ్రూపుల వివరాలు

నవంబర్ 19 నుంచి 29 వరకు దోహాలో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం జట్లను రెండు గ్రూపులుగా విభజించారు:

గ్రూప్-బి: భారత్ ఎ, పాకిస్తాన్ ఎ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), నేపాల్.

గ్రూప్-ఎ: బంగ్లాదేశ్ ఎ, శ్రీలంక ఎ, ఆఫ్ఘనిస్తాన్ ఎ, హాంకాంగ్, చైనా.

రెండు గ్రూపుల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు నవంబర్ 26, 27 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. టైటిల్ పోరు (ఫైనల్) నవంబర్ 29న జరుగుతుంది.

భారత మ్యాచ్‌ల వివరాలు

నవంబర్ 20: భారత్ ఎ వర్సెస్ నేపాల్ (తొలి మ్యాచ్)

నవంబర్ 22: భారత్ ఎ వర్సెస్ పాకిస్తాన్ ఎ (చిరకాల ప్రత్యర్థుల సమరం)

నవంబర్ 24: భారత్ ఎ వర్సెస్ యూఏఈ (చివరి లీగ్ మ్యాచ్)

టోర్నీ నేపథ్యం – భారత్ రికార్డు

యువ క్రికెటర్లకు అంతర్జాతీయ అనుభవాన్ని కల్పించడం, డొమెస్టిక్ క్రికెట్‌కు అంతర్జాతీయ స్థాయికి మధ్య వారధిగా నిలవడమే లక్ష్యంగా 2013లో ఈ టోర్నీ ప్రారంభమైంది. 2025లో దీని పేరును 'రైజింగ్ స్టార్స్ ఆసియా కప్'గా మార్చారు. అసోసియేట్ దేశాలైన నేపాల్, యూఏఈలకు బలమైన జట్లతో తలపడే అరుదైన వేదికగా ఇది నిలుస్తోంది. ఈ టోర్నీ చరిత్రలో పాకిస్తాన్ అత్యధికంగా మూడుసార్లు ఛాంపియన్‌గా నిలవగా, భారత్ కేవలం ఒకే ఒక్కసారి ట్రోఫీని ముద్దాడింది. గత ఎడిషన్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండటంతో, ఈసారి ఎలాగైనా ట్రోఫీని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బలమైన భారత యువ జట్టు బరిలోకి దిగుతోంది.

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌నకు భారత ఎ జట్టు

తిలక్ వర్మ (కెప్టెన్), రజత్ పాటిదార్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రింకు సింగ్, కుమార్ కుశాగ్ర, సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్.

Tags: