Rohit Yadav: భారతీయ క్రికెట్‌లో వయసు మోసాల (Age Fraud) ఉదంతం మరోసారి కలకలం రేపింది! వయసు ధ్రువీకరణ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు బెంగాల్ యువ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వేటు వేసింది. రోహిత్‌పై రెండేళ్ల పాటు నిషేధం విధించినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న అండర్-19 సిరీస్ కోసం భారత జట్టులోకి ఎంపికైన కొన్ని వారాలకే ఈ కఠిన చర్య తీసుకోవడం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోహిత్ యాదవ్.. గత జులైలో శ్రీలంకలో జరిగిన అండర్-19 టెస్ట్ మ్యాచ్‌లో ఆడి అద్భుతంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే, లంక టూర్ సందర్భంగా రోహిత్ సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించగా భారీ తేడాలు బయటపడ్డాయి. రోహిత్ వద్ద వేర్వేరు సంవత్సరాలతో కూడిన ఏకంగా మూడు జనన ధ్రువీకరణ పత్రాలు (2007, 2009, 2010) ఉన్నట్లు తేలింది. రికార్డుల్లో ఈ తేడాలను గమనించిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ఇప్పటికే అతన్ని జూనియర్ జట్ల నుంచి పక్కన పెట్టింది.

ఈ అంశంపై పూర్తి వివరాలను బీసీసీఐకి అందించడంతో.. డొమెస్టిక్ క్రికెట్‌లోనూ పాల్గొనకుండా రోహిత్‌పై రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం రోహిత్ మాత్రమే కాకుండా, ఏజ్ ఫ్రాడ్‌కు పాల్పడిన మరికొన్ని పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. 2026-27, 2027-28 సీజన్లకు సంబంధించి ఏకంగా 62 మంది ఆటగాళ్లను రిజిస్ట్రేషన్ లేదా ట్రాన్స్‌ఫర్‌కు అనర్హులుగా సీఏబీ ప్రకటించింది.

ఈ జాబితాలో మాజీ అండర్-19 ప్రపంచ కప్ విజేత రవి కుమార్, ఆల్ రౌండర్ విశాల్ భట్టి కూడా ఉండటం గమనార్హం. రవి కుమార్ రికార్డుల్లో ఏకంగా 45 నెలల వయసు వ్యత్యాసం ఉన్నట్లు తేలడంతో సీఏబీ ఆయనపై కూడా వేటు వేసింది. మిగతా ఆటగాళ్ల రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి జాబితాను తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ వయసు తప్పుగా చూపిస్తున్న ఆటగాళ్లపై బోర్డులు మరింత కఠినంగా వ్యవహరిస్తుండటంతో జూనియర్ సర్కిల్‌లో కలవరం మొదలైంది!

Tags: