India-Pakistan Clash: మహిళల క్రికెట్‌లో మరో హైఓల్టేజ్ సమరానికి రంగం సిద్ధమైంది! టోర్నీలో ఇప్పటికే వరుస విజయాలతో జోరుమీదున్న హర్మన్‌సేన, దాయాది పాకిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. తర్వాతి రౌండ్లలో బలమైన ప్రత్యర్థులు ఎదురుకానున్న నేపథ్యంలో.. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి జోరు కొనసాగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఉన్న గణాంకాలు, సూపర్‌ ఫామ్ ప్రకారం చూస్తే.. ఆసియా స్థాయిలో టీమిండియాను ఎదుర్కొనే స్థాయి ప్రస్తుతానికి ఏ జట్టుకూ లేదనే చెప్పాలి. గతేడాది రన్నరప్‌గా నిలిచిన భారత్, ఈసారి ఎలాగైనా ట్రోఫీని కైవసం చేసుకోవాలని కసిగా ఉంది.

ఇండియన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో రికార్డు సెంచరీ బాదిన వైస్ కెప్టెన్ స్మృతి మంధాన.. ప్రత్యర్థి బౌలర్లకు స్పష్టమైన హెచ్చరికలు పంపింది. అయితే, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న ప్రతీకా రావల్ మాత్రం టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లుగా రాణించలేకపోతోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ కూడా క్రీజులో కుదురుకొని వేగంగా ఆడే అవసరం ఎంతైనా ఉంది. వన్డేల్లో ఈ ఇద్దరూ అదరగొట్టినా, పొట్టి ఫార్మాట్‌లో జట్టు అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేకపోతున్నారు.

ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. నందిని శర్మ జట్టులోకి రావడంతో పేస్ అటాక్ మరింత బలోపేతమైంది. క్రాంతి గౌడ్‌తో కలిసి నందిని పవర్‌ప్లేలోనే వికెట్లు తీస్తుండడం ఇండియాకు అతిపెద్ద సానుకూలాంశం. తోడుగా ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు కూడా ప్రత్యర్థి బ్యాటర్లకు ముచ్చమటలు పట్టించేందుకు సిద్ధంగా ఉన్నారు.

మరోవైపు, దాయాది పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్‌లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. థాయ్‌లాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన పాక్.. అతికష్టమ్మీద 119 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఇప్పుడున్న బలహీనమైన బ్యాటింగ్‌ లైనప్‌తో టీమిండియాను ఎదుర్కొవడం ఆ జట్టుకు సవాలే అని చెప్పాలి. ఓపెనర్ మునీబా అలీ, కెప్టెన్ ఫాతిమా సనాపైనే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. భారత్‌లాంటి పటిష్టమైన ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కోవాలంటే పాక్ తమ వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సిందే! మరి ఈ పోరులో ఆధిపత్యం చెలాయించి భారత్ విజయం సాధిస్తుందా? లేదా? వేచి చూడాల్సిందే!

Tags: