Ahmedabad Proposed as Venue for Asian Games: భారత క్రీడా రంగం మరో అద్భుతమైన మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రపంచ క్రీడలకు కేంద్రంగా నిలవాలన్న లక్ష్యంతో భారత్ కీలక అడుగు వేసింది. 2038 ఆసియా గేమ్స్‌ను నిర్వహించేందుకు ఇండియా సిద్ధమని ప్రకటిస్తూ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధికారికంగా తన ఆసక్తిని వ్యక్తం చేసింది.

ఇటీవల చైనాలోని సాన్యాలో జరిగిన ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఇండియా తన ప్రతిపాదనను ఉంచింది. ఐవోఏ సీఈవో రఘురామ్ అయ్యర్ ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడిస్తూ దీనిపై త్వరలోనే ఓసీఏ నుంచి స్పష్టత వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిడ్ దాఖలు చేయడానికి ప్రత్యేక గడువు లేకపోయినా, భారత్ ముందస్తుగానే తన సంసిద్ధతను చాటుకుంది.

భారతదేశం ఇప్పటికే 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు, అలాగే 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి అహ్మదాబాద్ నగరాన్ని ప్రతిపాదించింది. ఒకవేళ 2038 ఆసియా క్రీడల బిడ్‌ను భారత్ గెలుచుకుంటే, వాటిని కూడా అహ్మదాబాద్‌లోనే నిర్వహించే అవకాశం ఉంది. అత్యాధునిక క్రీడా సౌకర్యాలతో అహ్మదాబాద్ ఇప్పుడు గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా మారుతోంది. గతంలో 1951,1982లో న్యూఢిల్లీ ఆసియా క్రీడలకు ఆతిథ్యమివ్వగా, దాదాపు 5 దశాబ్దాల తర్వాత మళ్ళీ భారత్‌లో ఈ క్రీడలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదు. 2038 క్రీడల కోసం ఇండియాతో పాటు సౌత్ కొరియా , మంగోలియా కూడా గట్టి పోటీనిస్తున్నాయి. 2026లో జపాన్, 2030లో ఖతార్, 2034లో సౌదీ అరేబియా ఈ క్రీడలను నిర్వహించనున్నాయి. మరి 2038లో ఆతిథ్య నగరం ఏదనేది 2028లో ఖరారు కానుంది. ఒలింపిక్స్ కల నెరవేరే దిశగా ఆసియా గేమ్స్ బిడ్ ఒక కీలక మలుపు కానుంది.

Tags: