Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్లో మరో వివాదం.. కోచ్‌ల తొలగింపుపై ముస్తాక్ అహ్మద్ తీవ్ర అసంతృప్తి
తీవ్ర అసంతృప్తి
Pakistan Cricket: సాధారణంగా ఏ దేశ క్రికెటర్ అయినా సరే, ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత సొంత దేశానికి సేవ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ పాకిస్థాన్ మాజీ ఆటగాళ్ల పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.'సొంత దేశం కోసం పనిచేయాలంటేనే నాకు భయమేస్తోంది అంటూ పాకిస్థాన్ మాజీ స్పిన్ దిగ్గజం ముస్తాక్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ దారుణ ప్రదర్శనతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పర్యటన మధ్యలోనే ఆటగాళ్లతో పాటు ఇద్దరు కోచ్‌లపై వేటు వేసింది. సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్‌లను ఇలా ఉన్నట్టుండి బాధ్యతల నుంచి తప్పించడంపై ముస్తాక్ అహ్మద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పాక్ బోర్డు తీరుపై స్పందిస్తూ... 'నా దేశానికి సేవ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపి, బలమైన టీమ్‌ను తయారు చేయడానికి నాకు కోచింగ్ ఇవ్వాలని ఉంది. కానీ పీసీబీ నుంచి సరైన మద్దతు లభిస్తేనే ఇదంతా సాధ్యం' అని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా, 'సర్ఫరాజ్, గుల్‌లను తొలగించిన తీరు నన్ను ఎంతగానో బాధించింది. గౌరవం లేని చోట, కారణాలు లేకుండా ఉన్నట్టుండి ఉద్యోగంలోంచి తీసేస్తే... సొంత దేశం కోసం పనిచేయడానికి కూడా ఎవరైనా భయపడతారు' అంటూ పీసీబీ వైఖరిని ఎండగట్టారు. గతంలో పీసీబీలో పనిచేసి, ఆ తర్వాత బంగ్లాదేశ్ స్పిన్ కోచ్‌గానూ వ్యవహరించిన ముస్తాక్ అహ్మద్ చేసిన ఈ వ్యాఖ్యలు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టాయి.