Duleep Trophy Final: టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ క్రీజులోకి దిగాడంటే పరుగుల సునామీ రావాల్సిందే!తాజాగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ సారథిగా బాధ్యతలు చేపట్టిన ఇషాన్ కిషన్, తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.నాయకత్వ బాధ్యత పడితే తన ఆట మరింత ప్రమాదకరంగా మారుతుందని మరోసారి నిరూపించాడు.

సౌత్ జోన్‌తో జరుగుతున్న ఈ కీలక ఫైనల్ మ్యాచ్‌లో ఇషాన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. కేవలం 270 బంతుల్లోనే ద్విశతకాన్ని పూర్తి చేసిన ఇషాన్, ఆ తర్వాత కూడా తన విధ్వంసాన్ని కొనసాగించాడు. ఏకంగా 250 పరుగులు సాధించి, అలసట వల్ల రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు.

ఓవర్‌నైట్ స్కోరు 385/4తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్, కుమార్ కుశాగ్ర నిలకడైన భాగస్వామ్యాన్ని అందించారు. కుమార్ కుశాగ్ర కూడా శతకంతో మెరిసి 101 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. ఐదో వికెట్‌కు వీరిద్దరూ కలిసి ఏకంగా 230 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. కుశాగ్ర అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అనుకుల్ రాయ్‌తో కలిసి ఇషాన్ కిషన్ ప్రత్యర్థి బౌలర్లపై దండయాత్ర చేశాడు. సౌత్ జోన్ బౌలర్లను నలుమూలలా బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు.

వీరిద్దరి ధాటికి ఈస్ట్ జోన్ 150 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి ఏకంగా 680 పరుగుల కొండంత స్కోరును సాధించింది. కెప్టెన్‌గా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా, వీరోచిత శతకంతో జాతీయ సెలెక్టర్లకు ఇషాన్ కిషన్ గట్టి సందేశాన్నే పంపాడు.

Tags: